పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించినట్లు అసెంబ్లీ ప్రకటించిన సీఎం
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 16 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారందరికీ సామాజిక మాధ్యమాల వినియోగానికి చెక్ పెట్టబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది కూడా. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఆమోదం తెలిపే అవకాశాలు లేకపోలేదు. స్మార్ట్‌ఫోన్ వ్యసనం, ఆన్‌లైన్ భద్రత ప్రమాదాలు, యువ వినియోగదారులలో అధిక స్క్రీన్ సమయం వంటి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. 2026-27 బడ్జెట్‌ను ఆయన ఈ ఉదయం సభల ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల పిల్లలపై కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నిషేధించాలని స్పష్టమైన ప్రకటన చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది కర్ణాటక. ఇంతకుముందు ఏపీ, గోవా వంటి రాష్ట్రాలు ఇలాంటి చర్యలు తీసుకోవడాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి.

పిల్లలకు సోషల్ మీడియా అందుబాటును నియంత్రించాలనే ఆలోచన కర్ణాటక ప్రభుత్వంలో కొంతకాలంగా చర్చలో ఉంది. రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ ఏడాది ప్రారంభంలో అసెంబ్లీలో దీనిపై ఓ ప్రకటన చేశారు. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోన్నామని అప్పట్లో తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా ఉపయోగపడేలా అందుబాటులో ఉన్న అంశాలను పరిశీలిస్తోన్నామని చెప్పారు.
అది ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది. ఇదే విషయాన్ని సిద్ధరామయ్య వెల్లడించారు. అధిక స్క్రీన్ వినియోగం వల్ల పిల్లలపై దుష్ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. నియంత్రణ లేని సామాజిక మాధ్యమాల వినియోగం విద్యతో పాటు కుటుంబ వాతావరణాన్ని కూడా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో ఈ అంశంపై చర్చించి, 16 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ ఫోన్లను పరిమితం చేయడంపై వారి అభిప్రాయాలను సేకరించామని గుర్తు చేశారు.
అలాగే మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి విద్యార్థులకు అవగాహన, కఠిన నిబంధనలు, సహాయ కేంద్రాల ద్వారా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఒకటి నుండి 10వ తరగతి వరకు విలువ ఆధారిత పాఠ్య పుస్తకాలు ఉచితంగా అదిస్తామని తెలిపారు. పీయూసీ స్థాయి విద్యార్థుల వరకు దీన్ని విస్తరింపజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పీయూసీ కళాశాలల్లో కొత్త గదుల నిర్మాణం, పాత గదుల మరమ్మత్తుల కోసం రూ. 565 కోట్లు కేటాయించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 75 కోట్లు, ఫర్నిచర్ కొనుగోలుకు రూ. 25 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు సిద్ధరామయ్య వివరించారు.












Click it and Unblock the Notifications