అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణం: సుదీర్ఘ గ్రహణ కాలం- జీవితంలో ఒక్కసారే
ఓ అద్భుతమైన సూర్యగ్రహణం కోసం స్కైగేజర్స్ ఎదురు చూస్తోన్నారు. దీనిని గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్ అని పిలుస్తారు. గ్రహణ కాలం దాదాపు ఆరు నిమిషాల పాటు కొనసాగుతుంది. అదే దీని ప్రత్యేకత. ఈ సూర్య గ్రహణం యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కనిపిస్తుంది. దీని పాత్.. ఆయా దేశాల మీదుగా వెళుతుంది.
మొరాకో, ఈజిప్ట్, సౌదీ అరేబియాల్లో మిట్ట మధ్యాహ్నమే సంపూర్ణ అంధకారం ఏర్పడుతుంది. భారత్ లో ఇది కనిపించదు గానీ.. ఆ సమయంలో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అంతరిక్ష పరిశోధనల విషయంలో సంపూర్ణ సూర్యగ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉంది.

సూర్యుడి నుంచి వెలువడే కాస్మిక్ ఎనర్జీని అధ్యయనం చేయడానికి గ్రహణ సమయం దోహదపడుతుందనేది పరిశోధకుల వాదన. సాధారణ రోజుల కంటే గ్రహణ సమయంలో వెలువడే ఎనర్జీని అధ్యయనం చేయడం కొంత వరకు సులభంగా భావిస్తుంటారు.
సూర్యగ్రహణం చాలా అద్భుతంగా ఉంటుంది. పగటిని రాత్రిగా మారుస్తుంది. ఒక రకమైన చీకటి ఆవరించుకుంటుందా సమయంలో. కొన్ని నిమిషాల పాటు ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు. పట్టపగలే చీకటి ఆవరించుకోవడం వల్ల పక్షులు తమ గూటికి సైతం చేరుకుంటుంటాయి. వాటి కిలకిల రావాలు ఆగిపోతాయి. గాలి చల్లగా మారుతుంది.
భూమి-, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు- సూర్యుడి ఉపరితలంపై దాని నీడ పడుతుంది. దీనివల్ల భూమి నుండి చూసేవారికి సూర్యుడు చంద్రుడి ఛాయలో కనిపిస్తాడు. 2027 ఆగస్టు 2వ తేదీన ఈ అపూర్వ సంఘటన చోటు చేసుకోనుంది. ఆరు నిమిషాల పాటు గ్రహణ సమయం చాలా అరుదు.
గ్రహణం ఏర్పడిన సమయంలో కోట్లాది మంది ప్రజలు ప్రత్యక్షంగా చంద్రుని నీడలోకి వస్తారు. పగటిపూట సంపూర్ణ అంధకారాన్ని అనుభవిస్తారు. చాలామంది జీవితంలో ఇంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడటం ఇదే మొదటిసారి అవుతుంది.
ఈ గ్రహణం యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. అనేక నగరాలు దాదాపు ఆరు నిమిషాల పాటు చీకటిలో మునిగిపోతాయి. Space.com ప్రకారం- మళ్లీ ఇలా అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం 2114లో మాత్రమే సంభవించే అవకాశం ఉంది.
ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రారంభమవుతుంది. దక్షిణ స్పెయిన్, జిబ్రాల్టర్ మీదుగా ఉత్తర ఆఫ్రికా వైపు కదులుతుంది. మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్ వంటి దేశాలను కవర్ చేస్తుంది. అక్కడి నుండి ఎర్ర సముద్రం మీదుగా సౌదీ అరేబియా, యెమెన్, సోమాలియాలోని కొన్ని ప్రాంతాల మీదుగా వెళుతుంది. ఈజిప్ట్‌లోని లక్సర్‌లో ఆరు నిమిషాల పాటు సంపూర్ణ గ్రహణం కనిపిస్తుందని భావిస్తున్నారు.
భారత్ లో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపించదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత సహా చాలా నగరాల్లో పాక్షిక గ్రహణం ఏర్పడుతుంది. TimeandDate.com ప్రకారం- భారత్ లో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గ్రహణం ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications