దెబ్బకొట్టిన గూగుల్- అయిదు దేశాల టెక్కీలు ఇకపై.. !!
టెక్ జెయింట్ గూగుల్.. తన నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా కంపెనీకి చెందిన పలు కీలక విభాగాల్లోని వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ల ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారీగా నిధులు కేటాయిస్తోన్న నేపథ్యంలో సంస్థాగత వ్యయాన్ని అదుపులో ఉంచుకోవడానికి గూగుల్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ లో ప్రారంభించిన ఈ పథకాన్ని కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ కు విస్తరించింది. ఆయా దేశాల్లో పని చేస్తోన్న గూగుల్ ఉద్యోగులకు ఇది అందుబాటులోకి వచ్చింది.
ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ అనేది గూగుల్ లో ఉన్న అన్ని విభాగాలకు సమానంగా వర్తించట్లేదు. ఏఐ రీసెర్చ్ వింగ్ డీప్‌మైండ్ తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం గూగుల్ క్లౌడ్ ను ఇందులో నుంచి మినహాయించారు. రాబోయే కాలంలో ఏఐ, క్లౌడ్ కు విపరీతంగా డిమాండ్ ఉంటుందని అంచనా వేసిన గూగుల.. ఈ రెండింట్లో కూడా నూతన నియామకాలను కొనసాగించనుంది. ఈ రెండు మినహా ఇతర విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది.

వాలంటరీ ఎగ్జిట్ విధానం ఇప్పటికే స్విట్జర్లాండ్ లో మొదలైంది కూడా. జ్యూరిచ్ లో గూగుల్‌కు చెందిన ఇంజినీరింగ్ సెంటర్ లో సుమారు 5,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జూన్ లోనే ఇక్కడి ఉద్యోగులకు ఈ ఆఫర్ అందింది. గూగుల్ అందించిన ప్యాకేజీ నిబంధనల ప్రకారం వాలంటరీగా సంస్థను వీడి వెళ్లే ఉద్యోగికి.. అతను పని చేసిన ప్రతి ఒక సంవత్సరానికి గాను ఒక నెల వేతనాన్ని పరిహారంగా చెల్లిస్తారు. దీనికి ఓ పరిమితి ఉంది. ఏ ఉద్యోగికైనా గరిష్టంగా 12 నెలల వేతనానికి సరిపడా మొత్తం మాత్రమే ప్యాకేజీగా లభిస్తుంది.
గూగుల్ మాత్రమే కాకుండా ఇతర ప్రధాన టెక్ కంపెనీలు కూడా తమ మానవ వనరుల అవసరాలను పునఃపరిశీలిస్తోన్నాయి. మైక్రోసాఫ్ట్ కూడా ఇటీవల అమెరికా, కెనడా, బ్రిటన్ , భారత్‌లలోని దాదాపు 60,000 మంది ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్‌ను ప్రకటించింది. 2.23 లక్షల మంది మొత్తం ఉద్యోగుల్లో లెవెల్ 70 లేదా అంతకంటే తక్కువ స్థాయిలో పనిచేస్తున్న 27 శాతం మంది ఉద్యోగులు ఈ వాలంటరీ బైఅవుట్ ప్యాకేజీకి అర్హులు.
ఏఐ, డేటా సెంటర్ల నిర్మాణానికి మైక్రోసాఫ్ట్ బిలియన్ల కొద్దీ డాలర్లను కేటాయిస్తోంది. ఏప్రిల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని, జూలైలో 4,800 మంది ఉద్యోగుల కోత పెట్టిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు మరో దఫా వాలంటరీ బైఅవుట్ ను ప్రకటించింది. దీనికి అంగీకరించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు డిసెంబర్ చివరి నాటికి కంపెనీని వీడాల్సి ఉంటుంది.













Click it and Unblock the Notifications
