రూ. 10 చిల్లర గొడవ.. ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి.. ఏం జరిగింది..?
రానురాను ప్రజల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఇటీవలికాలంలో చాలామంది క్షణికావేశంతో ప్రవర్తిస్తున్నారు. తాజాగా రూ. 10 చిల్లర కోసం జరిగిన చిన్న గొడవలో ఓ యువతి నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ప్రయాణికురాలి క్షణికావేశం కారణంగా 24 ఏళ్ల ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రాణాలు కోల్పోయింది. ఎన్నో కలలతో ఉద్యోగంలోకి అడుగుపెట్టిన ఆమె ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపో పరిధిలో కండక్టర్ గా గుండ్ల ప్రవళిక విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గత నె 25 వ తేదీన అశ్వాపురం మండలం మిట్టగూడెం ప్రాంతంలో బస్సులో ప్రయాణికురాలితో టికెట్, చిల్లర చెల్లింపుల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణ మరింత ముదరడంతో, ప్రయాణికురాలు ఆమెను బస్సులో నుంచి కిందకు తోసేసింది. అదే సమయంలో బస్సు చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. తొలుత సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచింది.
ఇక కండక్టర్ ప్రవళిక మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి ఆదుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మరోవైపు కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది.

ఇక కండక్టర్ ప్రవళిక మృతికి కారణమైన మహిళా ప్రయాణికురాలిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని.. ఆర్టీసీ సిబ్బందిపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
