దీపావళి వేళ.. బిగ్ షాక్: భారీగా పెరిగిన అమూల్ రేట్లు
దీపావళి పండుగకు కొద్ది రోజుల ముందు ప్రముఖ డైరీ దిగ్గజం అమూల్ బిగ్ షాక్ ఇచ్చింది. పండుగ వేళ ఇళ్లలో తయారు చేసే సాంప్రదాయ వంటకాలు, పిండివంటల తయారీలో కీలకమైన నెయ్యి, వెన్న ధరలను ఒక్కసారిగా పెంచింది. పండుగ సీజన్ కావడంతో వినియోగం విపరీతంగా పెరగడం వల్ల అమూల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హఠాత్ పెంపు కారణంగా పండుగ సమయంలో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఖర్చు పడనుంది.
గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఆవు నెయ్యి లభ్యత తగ్గినట్లు అమూల్ చెబుతోంది. పండుగ సీజన్ సందర్భంగా స్థానిక కొనుగోళ్లు జోరందుకోవడం, కొన్ని రాష్ట్రాల్లో డైరీ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడటంతో కంపెనీ ఉత్పత్తి వ్యయం పెరిగింది. వీటిన్నింటినీ అధిగమించడానికి ఘీ, బటర్ రేట్లు పెంచక తప్పలేదని అమూల్ యాజమాన్యం వెల్లడించింది. వేర్వేరు ప్యాకేజింగ్ ప్రమాణాలను బట్టి ఈ ధరల పెంపు రూ. 3 నుంచి రూ. 50 రూపాయల వరకు పెరిగింది.

దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ఊపందుకుంటున్న వేళ అముల్ ఉత్పత్తుల ధరలు పెరగడం సగటు కుటుంబాలపై అదనపు భారాన్ని మోపినట్టయింది. దేశవ్యాప్తంగా అమూల్ ఉత్పత్తులకు ఉన్న విపరీతమైన డిమాండ్ మధ్య ఈ ధరల పెంపు తక్షణమే అమలులోకి వచ్చింది. ఒక కిలో అమూల్ నెయ్యి కార్టన్ ధర 630 రూపాయల నుంచి 680 రూపాయలకు చేరింది. ఒక్కో కిలోపై 50 రూపాయలు పెరిగింది. 500 గ్రాముల ప్యూర్ నెయ్యి పౌచ్ ధర 325 రూపాయల నుంచి 345 రూపాయలకు చేరింది.
100 గ్రాముల బటర్ ప్యాకెట్ ధర 63 రూపాయల నుంచి 66 రూపాయలకు పెంచారు. 500 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర 310 రూపాయల నుంచి 325 రూపాయలకు పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపు వెనుక ప్రధానంగా నకిలీ నెయ్యిపై జరిగిన విస్తృత తనిఖీలే కారణమని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో పోలీసులు, ఆహార భద్రతా అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి దాదాపు రెండు లక్షల కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.
దీంతో వినియోగదారులు స్థానికులు బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వైపే మొగ్గు చూపుతున్నారు. మొదటి ప్రాధాన్యతగా అమూల్ నెయ్యినే ఎక్కువగా కొంటోన్నారు. దీంతో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అదే సమయంలో డైరీ ఉత్పత్తుల సరఫరాలో ఆటంకం నెలకొనడం వల్ల ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని, దీన్ని వినియోగదారులకు బదలాయించాల్సి వచ్చిందని అమూల్ చెబుతోంది.
సాధారణంగా దేశంలో ఏడాది పొడవునా జరిగే మొత్తం నెయ్యి విక్రయాల్లో సుమారు 45 శాతం వాటా పండుగల సీజన్లోనే నమోదవుతుంటుంది. వినాయక చవితి నుంచి ప్రారంభమయ్యే పండుగల కాలంలో పిండివంటలు, నైవేద్యాల తయారీకి నెయ్యి వినియోగం గణనీయంగా పెరుగుతుంది. నకిలీ ఉత్పత్తులను అరికట్టడంతో బ్రాండెడ్ కు డిమాండ్ ఏర్పడటం, పండుగల డిమాండ్ జతకావడంతో మార్కెట్లో అముల్ నెయ్యి, వెన్న సరఫరాపై ఒత్తిడి పెరిగింది.














Click it and Unblock the Notifications
