మెదడును ఏఐకి తాకట్టు పెట్టకండి.. నరాలు చిట్లే వార్నింగ్!
మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా.. ఈమెయిళ్లు రాయడానికి, లెక్కలు కట్టడానికి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా చాట్‌బాట్లను వాడుతున్నారా? అయితే ఈ వార్త మిమ్మల్ని ఖచ్చితంగా కలవరపెడుతుంది. మన ఆలోచనా శక్తిని ఏఐకి పూర్తిగా అప్పగించడం వల్ల భవిష్యత్తులో మతిమరుపు వ్యాధి అయిన 'డిమెన్షియా' (Dementia) బారిన పడే ప్రమాదం ఉందని ఒక ప్రముఖ న్యూరో సైంటిస్ట్ తీవ్రంగా హెచ్చరించారు. నిరంతరం మెదడుకు పని చెప్పకుండా, కృత్రిమ మేధస్సుపైనే ఆధారపడటం వల్ల మెదడు యొక్క సహజ రక్షణ వ్యవస్థ బలహీనపడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
అమెరికాకు చెందిన 'పాసిబిలిటీ ఇన్‌స్టిట్యూట్' చీఫ్ సైంటిస్ట్, థియరిటికల్ న్యూరో సైంటిస్ట్ వివియెన్ మింగ్ ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థతో ఈ సంచలన విషయాలను పంచుకున్నారు. "మీరు వాడే చాట్‌బాట్ నేరుగా మీకు అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి) వ్యాధిని కలిగించదు. కానీ, మీరు ప్రతి విషయానికి మెదడుతో ఆలోచించడం మానేసి, ఆ స్థానాన్ని ఏఐతో భర్తీ చేయడమే (క్రానిక్ సబ్‌స్టిట్యూషన్) అసలైన ప్రమాదం" అని ఆమె వివరించారు.

'కాగ్నిటివ్ రిజర్వ్' దెబ్బతింటే అంతే సంగతులు!
మన మెదడు వయసు పైబడటం వల్ల లేదా వ్యాధుల వల్ల వచ్చే నష్టాన్ని తట్టుకుని, సక్రమంగా పనిచేయడానికి 'కాగ్నిటివ్ రిజర్వ్' (Cognitive Reserve) అనే సామర్థ్యం ఎంతో అవసరం. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం, మానసిక శ్రమ చేయడం, లోతుగా ఆలోచించడం ద్వారా ఈ 'కాగ్నిటివ్ రిజర్వ్' బలపడుతుంది.
అయితే, ప్రతిదానికీ ఏఐని వాడటం వల్ల మెదడుకు శ్రమ తగ్గిపోతుంది. ఫలితంగా ఈ రక్షణ వ్యవస్థ కాలక్రమేణా క్షీణించి, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును తట్టుకునే శక్తిని మెదడు కోల్పోతుందని వివియెన్ మింగ్ హెచ్చరించారు. ఈ పరిస్థితిని ఆమె "వాడకపోతే ఉన్నది కాస్తా ఊడిపోతుంది" (Use it or lose it) అనే సామెతతో పోల్చారు.
ఇప్పటికే మొదలైన దుష్ప్రభావాలు: పరిశోధనల్లో షాకింగ్ నిజాలు
మెదడు పనిని వేరే పరికరాలకు అప్పగించడం (కాగ్నిటివ్ ఆఫ్ లోడింగ్) వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో చెప్పడానికి కొన్ని ప్రారంభ పరిశోధనలు చక్కటి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
జీపీఎస్ (GPS) వాడకం:
నిరంతరం దారి కోసం జీపీఎస్ నావిగేషన్‌పై ఆధారపడే వారిపై 'మెక్‌గిల్ యూనివర్సిటీ' ఒక పరిశోధన చేసింది. అందులో, సొంతంగా దారి గుర్తుంచుకుని వెళ్లే వారితో పోలిస్తే, జీపీఎస్ వాడే వారిలో స్థలాలు, దారులను గుర్తుంచుకునే 'స్పేషియల్ మెమరీ' చాలా బలహీనపడినట్లు తేలింది.
ఏఐ రైటింగ్ టూల్స్:
'ఎమ్ఐటీ మీడియా ల్యాబ్' (MIT Media Lab) చేసిన మరో చిన్న అధ్యయనంలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. రాయడం లేదా ఇతర పనుల కోసం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (AI) వాడిన వారి మెదడులో నరాల అనుసంధానం (Neural Connectivity) బలహీనపడినట్లు గుర్తించారు. అంతేకాదు, తాము కాసేపటి క్రితం ఏఐ సాయంతో ఏం రాశారో కూడా వారు సరిగ్గా గుర్తు తెచ్చుకోలేకపోయారు.
ఇవి ప్రాథమిక పరిశోధనలే అయినప్పటికీ, భవిష్యత్తులో మానవ మేధస్సుకు పొంచి ఉన్న ముప్పును ఇవి స్పష్టంగా సూచిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికతను కేవలం సాయం కోసమే వాడుకోవాలి కానీ, మన ఆలోచనా శక్తిని దానికి పూర్తిగా తాకట్టు పెట్టకూడదని ఈ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి














Click it and Unblock the Notifications