అంతరిక్షంలో ఫ్యూయెల్ పంప్ నిర్మాణం: చరిత్ర సృష్టించిన ISRO
భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రో ఈ ఏడాది తొలి మిషన్ ప్రారంభించింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సీ62 ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఈ ఉదయం సరిగ్గా 10:18 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ వర్క్‌హార్స్ గా పేరుగాంచిన పీఎస్ఎల్ వీ సిరీస్‌లో ఇది 64వ ప్రయోగం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పీఎస్ఎల్వీ- డీఎల్ వేరియంట్‌లో అయిదో మిషన్‌గా రూపొందించిన ఈ స్పేస్ వెహికల్ ఎత్తు 44.4 మీటర్లు. లిఫ్ట్ ఆఫ్ బరువు 260 టన్నులు. ఈ రాకెట్‌లో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశ 2పీఎస్ఓఎం ఎక్స్ ఎల్+ ఎస్ 139. రెండవది పీఎల్ 40 (హెచ్ పీ). మూడోదశలో హెచ్ పీఎస్ 3 కాగా.. కీలకమైన నాలుగో ఫేస్ లో ఎల్ 2.5 (ఏఐ) కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ఈ మిషన్ ప్రధాన పేలోడ్ ఈఓఎస్- ఎన్1. పర్యావరణ పర్యవేక్షణకు ఉద్దేశించిన అత్యాధునిక హైపర్‌స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది.

హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ద్వారా విస్తృత తరంగదైర్ఘ్యాలలో డేటాను సేకరిస్తుంది. వృక్షసంపద, నీటి నాణ్యత, భూ వాతావరణం- ఉపరితల మార్పులను ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఈ డేటాను విశ్లేషిస్తుంది. దేశ వైపరీత్యాల నిర్వహణ, వ్యవసాయం, వనరుల మ్యాపింగ్‌కు గణనీయమైన ఊతం ఇస్తుందీ మిషన్. ఈఓఎస్- ఎన్1 తో పాటు వివిధ అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలకు చెందిన 18 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ పీఎస్ఎల్వీ మిషన్ ద్వారా నింగిలోకి వెళ్లనున్నాయి.
పీఎస్ఎల్వీ-సీ62 కోర్-అలోన్ కాన్ఫిగరేషన్‌లో ప్రయాణిస్తుంది. ఉపగ్రహాలను తక్కువ భూ కక్ష్యలోకి (low Earth orbit) విజయవంతంగా ప్రవేశపెట్టేలా దీన్నిఆప్టిమైజ్ చేశారు. భూ ఉపరితలం నుంచి సుమారు 650 కిలో మీటర్ల ఎత్తులో సన్ సింక్రనైజ్డ్ ఆర్బిట్ లో ఇది పని చేస్తుంది.
పీఎస్ఎల్వీ మోసుకెళ్లిన శాటిలైట్లల్లో ఒకటి ఏయూల్‌శాట్. చెన్నైకి చెందిన స్టార్టప్ ఆర్బిట్ ఎయిడ్ ఏరోస్పేస్ దీన్ని రూపొందించింది. ఈ ఏయూల్‌శాట్, అంతరిక్షంలోనే ఉపగ్రహాలకు ఇంధనం నింపే (ఇన్-ఆర్బిట్ రిఫ్యూయలింగ్) సాంకేతికతతో కూడుకున్నది. ఇది వాణిజ్యపరంగా దేశ మొట్టమొదటి ఇన్-ఆర్బిట్ డాకింగ్, రిఫ్యూయలింగ్ ఇంటర్‌ఫేస్ కావడం విశేషం. దీంతో అంతరిక్షంలో ఉపగ్రహాల జీవితకాలాన్ని పొడిగించడం, వ్యర్థాలను తగ్గించే దిశగా భారత్.. ఈ మిషన్ ద్వారా కీలక అడుగు వేసింది.
ఏయూల్‌శాట్ అనేది అంతరిక్షంలో ఇంధనాన్ని మోసుకెళ్లే ఒక ట్యాంకర్ ఉపగ్రహం. దీని ప్రధాన లక్ష్యం ఎస్ఐడీఆర్పీ (SIDRP- Standard Interface for Docking and Refuelling Port) అనే ప్రత్యేక సాంకేతికతను పరీక్షించడం. ఇది దేశ, విదేశీ ఉపగ్రహాలతో సహా అన్ని రకాల శాటిలైట్లతో పనిచేయగలదు. వాటిని సమన్వయం చేసుకోగలదు. ఈ టెక్నాలజీ భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు ఊతమివ్వనుంది.
ఇందులో భాగంగా ఒకే ఉపగ్రహం లోపల ఒక ట్యాంక్ నుండి మరొక ట్యాంక్‌కు ప్రొపెల్లెంట్‌ను బదిలీ చేయడం, విద్యుత్, డేటాను మార్పిడి చేయడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియలన్నీ జీరో గురుత్వాకర్షణ వాతావరణంలో అంటే మైక్రోగ్రావిటీలో జరుగుతాయి. ఇది పని చేయడానికి ఇంధనంగా ప్రోపెన్‌ను ఉపయోగిస్తారు. ఇది హైడ్రాజిన్ కంటే సురక్షితమైన, చౌకైన పర్యావరణ అనుకూల ఇంధనం. ఈ రిఫ్యూయలింగ్ ద్వారా ఉపగ్రహాల జీవితకాలం పెరుగుతుంది.
చాలా శాటిలైట్లు ఇంధనం అయిపోవడంతో పని చేయకుండా పోతాయి. ఇంధనం నింపడం ద్వారా అవి చాలా సంవత్సరాలు తమ కార్యకలాపాలను కొనసాగించగలవు. కొత్త ఉపగ్రహాలను ప్రయోగించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా అంతరిక్ష వ్యర్థాల సమస్య కూడా తగ్గుతుంది. అంతరిక్షంలో సర్వీసింగ్, రిఫ్యూయలింగ్, నిర్వహణలతో ఒక కొత్త 'ఆన్ ఆర్బిట్ ఎకానమీ' ఏర్పడుతుంది. ఉపగ్రహాలు ఇకపై డిస్పోజబుల్‌గా ఉండవు.












Click it and Unblock the Notifications