ఆకాశంలో మరో విప్లవం.. పైలట్ లేకుండా వేల కిలోమీటర్ల విమాన ప్రయాణం!
జోబీ ఏవియేషన్ సంస్థ అమెరికా గగనతలంలో పైలట్ అవసరం లేకుండా 3,199 మైళ్ల(దాదాపు 5,148 కిలోమీటర్లు) దూరంతో కూడిన మొట్టమొదటి పూర్తి స్వయంప్రతిపత్త విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరీక్ష కోసం ప్రత్యేక మార్పులు చేసి 'సెస్నా కారవాన్' విమానాన్ని ఉపయోగించారు. అత్యవసర భద్రత కోసం ఓ పైలట్ విమానంలో కూర్చున్నప్పటికీ.. ప్రయాణంలో ఎలాంటి కంట్రోల్స్ లేదా బటన్‌లను ఆయన తాకలేదు. కాలిఫోర్నియా, సౌత్ కరోలినాలోని కేంద్రాల నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్న ఇంజనీర్లు విమానాన్ని రిమోట్‌గా పర్యవేక్షించారు.
పూర్తి రిమోట్ కంట్రోల్, అధునాతన సాంకేతికత
ఈ విమాన ప్రయాణంలో టాక్సీయింగ్, టేకాఫ్, నావిగేషన్, ల్యాండింగ్ వంటి కీలకమైన అన్ని దశలను విమానం టెక్నాలజీ సాయంతోనే పూర్తి చేయడం గమనార్హం. రిమోట్ ఆపరేటర్లు దాదాపు 2,323 మైళ్ల దూరం నుంచి ప్రయాణాన్ని పర్యవేక్షించారు. కంపెనీ నిర్వహించిన '2026 ఎలక్ట్రిక్ స్కైస్ టూర్'లో భాగమైన ఈ ప్రయోగాత్మక ప్రయాణం ద్వారా ప్రతికూల వాతావరణం, సవాలుతో కూడిన గగనతలాల్లో సాఫ్ట్‌వేర్ కచ్చితత్వాన్ని ఇంజనీర్లు విజయవంతంగా పరీక్షించారు.

రద్దీగా ఉండే విమానాశ్రయాలు.. తుఫానులను తట్టుకుని ప్రయాణం
సాధారణంగా చేసే ముందస్తు శిక్షణ పరీక్షల లాగా కాకుండా ఫీనిక్స్ డీర్ వ్యాలీ వంటి అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఈ విమానం వాస్తవిక సవాళ్లను కూడా ఎదుర్కొంది. ప్రయాణ మార్గంలో తీవ్రమైన గాలులు, తుఫానులు ఎదురైనప్పటికీ.. ఏ మాత్రం తడబడకుండా స్వయంప్రతిపత్తి వ్యవస్థ సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల పరిస్థితులు, విమానాశ్రయాల రద్దీని అధిగమించే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉందని ఈ పరీక్షలో నిరూపించబడింది.
వాణిజ్య, రక్షణ, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు
ఈ ప్రయాణంలో భాగమైన టెక్సాస్ ఫోర్ట్ వర్త్ అలయన్స్ ఎయిర్పోర్టులో సరుకు రవాణా పనితీరును, సౌత్ కరోలినాలోని షా ఎయిర్ ఫోర్స్ బేస్ లో సైనిక కార్యకలాపాల సామర్థ్యాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తులో వాణిజ్య లాజిస్టిక్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, రక్షణ రంగాల్లో ఈ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. అంతే కాకుండా నార్త్ కరోలినాలో 'eLIFT-NC' చొరవ కింద అత్యవసర వైద్య సామాగ్రిని చేరవేయడంలో కూడా ఈ విమానం సహకరించింది.
రైట్ సోదరుల చారిత్రాత్మక ప్రాంతంలో ల్యాండింగ్
నార్త్ కరోలినా చేరుకున్న తర్వాత 1903లో రైట్ సోదరులు ప్రపంచంలోనే తొలి విమాన ప్రయాణం చేసిన కిట్టీ హాక్ లోని 'ఫస్ట్ ఫ్లైట్ మాన్యుమెంట్' మీదుగా ఈ విమానం తక్కువ ఎత్తులో ప్రయాణించి చారిత్రాత్మక ల్యాండింగ్ ను నమోదు చేసింది. ఇప్పటివరకు జోబీ ఏవియేషన్ సంస్థ 400కి పైగా ప్రయోగాత్మక విమాన ప్రయాణాలు, 800 గంటల ఆటోనామస్ ఫ్లయింగ్ అనుభవాన్ని సాధించింది. విమాన ప్రయాణాలను మరింత సురక్షితంగా, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కంపెనీ సీఈవో జో బెన్ బెవిర్ట్ తెలిపారు.














Click it and Unblock the Notifications
