ఏపీ వైపు ముంచుకొస్తున్న ముప్పు, అతి భారీ వర్షాలు- ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!
ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ వైపు దూసుకొస్తుంది. రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి తీరాన్ని తాకనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తం గా రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దీంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలక ఆదేశాలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాతి 24 గంటల్లో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనానికి తోడు ఉత్తర బంగాళాఖాతం నుంచి ఈ వ్యవస్థ వరకు ఒక ద్రోణి, ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి తమిళనాడు మీదుగా మరో ద్రోణి విస్తరించి ఉండటం వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో.. హోం మంత్రి అనిత భారీ వర్షాల హెచ్చరిక వేళ ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. ఒడిశాలో వర్షాలతో వంశధార, నాగావళి నదులకు పొంగే అవకాశం ఉందని.బోర్డర్ ఒడిశా జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాలి సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సైతం శ్రీకాకుళం జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
భారీ వర్షాల వేళ సహాయక చర్యల కోసం SDRF, NDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే తీరం వెంబడి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్దేశించారు. వాగులు, పొంగిపొర్లే కాజ్‌వేలు, ముంపు ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచి, పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని సూచించారు. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో.. చెట్లు, భారీ హోర్డింగ్స్ , శిధిలావస్థలో ఉన్న ఇళ్ళ వద్ద ఉండరాదని సూచనలు చేసారు. ప్రజలు ప్రభుత్వ వాతావరణ హెచ్చరికలు పాటించాలి...తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.













Click it and Unblock the Notifications
