అంతరిక్షం మెగా మైల్ స్టోన్: ఒకేసారి 27 శాటిలైట్లు- ఆర్బిట్ సైతం
ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఎనిమిది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 100వ ఫాల్కన్ రాకెట్ ప్రయోగాన్ని పూర్తి చేసి నూతన రికార్డు సృష్టించింది. అమెరికా కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ఆ దేశ కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3:25 నిమిషాలకు చేపట్టిన తాజా ప్రయోగంతో ఈ రికార్డును అందుకుంది.
ఈ తాజా ప్రయోగంలో ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో 27 స్టార్‌లింక్ ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారు. ఈ సంవత్సరంలో ఇది 99వ ఫాల్కన్ 9 మిషన్ కాగా, అంతకుముందు ఏప్రిల్‌లో నిర్వహించిన ఒకే ఫాల్కన్ హెవీ మిషన్‌తో కలిపి ఈ ఏడాది చేసిన మొత్తం ప్రయోగాల సంఖ్య 100కు చేరింది. ఈ చారిత్రక మైలురాయిని అందుకున్నట్లు స్పేస్ ఎక్స్ సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో వెల్లడించింది.

నింగిలోకి దూసుకెళ్లిన దాదాపు ఎనిమిది నిమిషాల తర్వాత.. ఫాల్కన్ 9 మొదటి దశ బూస్టర్ విజయవంతంగా విడిపోయింది. పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. బీ1100 గా నామకరణం చేసిన ఈ బూస్టర్ అంతరిక్షంలోకి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ప్రయాణించి విజయవంతంగా భూమికి చేరడం గమనార్హం. స్పేస్ ఎక్స్ నిర్మించే ఈ బూస్టర్లను మళ్లీ మళ్లీ ప్రయోగించేలా అభివృద్ధి చేశారు ఆ సంస్థ శాస్త్రవేత్తలు.
రాకెట్ల పునర్వినియోగం గురించి స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కీలక విషయాలను వెల్లడించారు ఈ సందర్భంగా అంతరిక్ష రంగంలో పూర్తి స్థాయిలో అత్యంత వేగంగా పునర్వియోగించుకోదగ్గ ఆర్బిటల్ రాకెట్‌ను అభివృద్ధి చేయడానకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఈ దిశగా తాము విజయం సాధించామని పేర్కొన్నారు. దీనికి ఈ బూస్టర్లే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రీయూజ్ చేసే వ్యోమనౌక తయారీకి అయ్యే ఖర్చు.. ఒక్కసారి మాత్రమే వాడి పారేసే చిన్న రాకెట్ కంటే చాలా తక్కువగా ఉంటుందని, ఇది అంతరిక్ష చరిత్రలోనే భారీ మార్పునకు దారితీస్తుందని స్పష్టం చేశారు.
ఈ ఏడాది స్పేస్ ఎక్స్ జరిపిన 99 ఫాల్కన్ 9 లల్లో అత్యధికంగా 76 ప్రయోగాలు స్టార్‌లింక్ ఉపగ్రహాల కోసమే కేటాయించడం విశేషం. ప్రస్తుతం భూమికి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న స్టార్‌లింక్ యాక్టివ్ ఉపగ్రహాల సంఖ్య 11,000 మార్కును దాటిపోయింది. దీంతో కారవాన్ చరిత్రలోనే అత్యంత భారీ శాటిలైట్ నెట్‌వర్క్ నిర్మించిన సంస్థగా స్పేస్ ఎక్స్ గుర్తింపు పొందింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను లక్షకు చేర్చాలనేది కంపెనీ వ్యూహం.
Falcon 9 lifts off from California and delivers 27 @Starlink satellites to orbit, completing our 100th Falcon launch of the year pic.twitter.com/cL8QFGCBHV
— SpaceX (@SpaceX) August 22, 2026
స్టార్‌లింక్ వ్యవస్థలో నెక్స్ట్ జెన్ టెక్నాలజీ కలిగిన స్టార్‌లింక్ వీ3 శాటిలైట్లను ప్రయోగించడానికి స్పేస్ ఎక్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన తరహా ఉపగ్రహాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరింత నాణ్యమైన ఇంటర్నెట్ సేవలను ఎక్కువ మంది వినియోగదారులకు అందించవచ్చని స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్ తెలిపారు. ఇప్పటికే ఉన్న సేవల కంటే ఇవి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయని, రిమోట్ ఏరియాలలో కూడా హైస్పీడ్ నెట్ అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications