వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్!.. 2027 వరల్డ్‌కప్‌కు ‘బాంబ్ స్క్వాడ్'!!
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల ఉమ్మడి ఆధ్వర్యంలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన డ్రీమ్ 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు 'బాంబ్ స్క్వాడ్' అని పేరుపెట్టిన ఆయన.. జట్టు కూర్పులో పలు సంచలన, అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే ఒక సంవత్సర కాలం పాటు ఇదే 15 మంది ఆటగాళ్లు కలిసి ఆడితే ప్రపంచ కప్‌కు అత్యుత్తమ టీమ్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రెగ్యులర్ ఆటగాళ్లకు షాక్.. వైభవ్‌కు చోటు
ప్రస్తుత వన్డే జట్టులో నిలకడగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లను రాబిన్ ఉతప్ప తన జట్టు నుంచి పక్కన పెట్టారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో తన ప్రతిభతో మెరిసిన 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే బ్యాకప్ వికెట్ కీపర్ స్థానంలో ఇషాన్ కిషన్ కంటే సంజూ శాంసన్‌కే ఓటేశారు. సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో పాటు ఫినిషర్‌గానూ రాణించగలడని రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు.

సీనియర్ల రీ-ఎంట్రీ.. అనుభవానికి ప్రాధాన్యత
ప్రధాన బ్యాటర్లుగా ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లతో పాటు రోహిత్ శర్మను కూడా తన జట్టులో కొనసాగించారు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు మళ్లీ అవకాశం కల్పించారు. ఐపీఎల్‌లో 28 వికెట్లతో మెరిసిన భువనేశ్వర్ కుమార్.. దాదాపు నాలుగేళ్లుగా వన్డేలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఆయన అనుభవం దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని భావించారు.
బౌలింగ్ విభాగం.. తుది జట్టు కూర్పు
జట్టులో ఏకైక పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాను ఎంచుకున్న రాబిన్ ఉతప్ప.. బ్యాకప్ పేసర్‌గా మరో ఆల్‌రౌండర్‌ను తీసుకోకుండా నలుగురు ప్రధాన పేసర్లకే ప్రాధాన్యం ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లతో పాటు భువనేశ్వర్ కుమార్‌ను పేస్ విభాగానికి ఉతప్ప ఎంపిక చేశారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలతో పాటు కుల్దీప్ యాదవ్‌ను స్థిరమైన స్పిన్నర్‌గా చేర్చారు.
రాబిన్ ఉతప్ప ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టు
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.













Click it and Unblock the Notifications