వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్
టీ20 వరల్డ్ కప్ లో తొలి సెమీస్ వన్ సైడ్ అయింది. దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ లో అడుగు పెట్టింది. బుధవారం రాత్రి కోల్ కత ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో సఫారీలపై జయించింది కివీస్. ఓపెనర్ ఫిన్ అలెన్ సెంచరీతో కదం తొక్కాడీ మ్యాచ్ లో. 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా టీ20 ఇంటర్నేషనల్స్ లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.
నేడు రెండో సెమీస్. ఇంగ్లాండ్ ను ఢీ కొట్టబోతోంది టీమిండియా. వాంఖడే స్టేడియం దీనికి వేదిక. ప్రపంచ కప్ సెమీఫైనల్స్ భారత జట్టుకు చారిత్రక నిరాశను మిగిల్చిన స్టేడియం ఇది. 2023లో న్యూజిలాండ్‌పై సాధించిన విజయం మినహా, భారత్ ఈ వేదికపై ఆడిన మూడు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో రెండింటిలో పరాజయం పాలైంది. 1987లో ఇంగ్లాండ్ చేతిలోనే ఓడిందిక్కడ. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

సెమీస్ చేరుకోవడానికి భారత జట్టు సమష్టిగా ఆడలేదు. వ్యక్తిగత మెరుపులపైనే ఎక్కువగా ఆధారపడింది. అమెరికాపై సూర్యకుమార్ యాదవ్, నమీబియా, పాకిస్తాన్ లపై ఇషాన్ కిషన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై శివమ్ దూబే, జింబాబ్వేపై అభిషేక్ శర్మ-హార్దిక్ పాండ్యా జోడీ, వెస్టిండీస్ పై సంజు శాంసన్.. ఇలా కీలక సమయాల్లో ఒకరిద్దరు మాత్రమే జట్టును ఆదుకున్నారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో నిలకడలేమి ప్రదర్శన కనబరచడం భారత కష్టాలకు ప్రధాన కారణం.
కేప్టెన్ సూర్యకుమార్ సైతం ప్రారంభ మ్యాచ్ మినహా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. ఫీల్డింగ్ లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా క్యాచ్‌లు తీయడం చాలా దారుణంగా ఉంది. పరిస్థితి చేజారిపోతున్నట్లు కనిపించినప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ భారత్‌కు తరచుగా సహాయపడింది. అర్ష్‌దీప్ సింగ్ వైడ్ యార్కర్లు, హార్దిక్ పాండ్యా స్లో బౌన్సర్లు కీలక సమయాల్లో ఫలించినప్పటికీ, వారి ప్రభావం అంతంతమాత్రమే.
ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోవాలంటే, వ్యక్తిగత పరాక్రమం కాకుండా సమష్టిగా ఆడకతప్పదు. సూర్యకుమార్ యాదవ్ మొదలుకుని హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే, ఇషాన్ కిషన్ వంటి పలువురు భారత ఆటగాళ్లకు ఇది వాంఖెడే కొట్టినపిండి. వీరంతా ముంబై, ముంబై ఇండియన్స్ తరపున ఇక్కడ ఆడారు. ఇది హైస్కోరింగ్ మ్యాచ్ అవుతుందని మోర్నె మోర్కెల్ అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఇదే వేదికపై, ఇదే ప్రత్యర్థిపై అభిషేక్ శర్మ ఏడాది క్రితం అద్భుతమైన సెంచరీ సాధించాడు.
భారత్ తుదిజట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.












Click it and Unblock the Notifications