Jay Shah: అమిత్ షా కొడుక్కే ఐసీసీ అధ్యక్ష పదవి..!
గత కొన్నేళ్లుగా బీసీసీఐలో చక్రం తిప్పుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు, బోర్డు కార్యదర్శి జై షాకు ప్రమోషన్ దక్కబోతోంది. బీసీసీఐ అధ్యక్షుడు కాలేకపోయిన ఆయన.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఛైర్మన్ పదవి అధిష్టించబోతున్నారు. గతంలో బీసీసీఐ అధ్యక్షులుగా పనిచేసిన జగ్ మోహన్ దాల్మియా, శరద్ పవార్ వంటి వారు ఐసీసీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు వీరి వారసుడిగా జై షా ఐసీసీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా గ్రెగ్ బార్క్ లే ఉన్నారు. ఆయన పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త ఛైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి అయిన జై షాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్ మైక్ బైర్డ్‌తో సహా ఐసీసీ డైరెక్టర్లకు బార్క్లే వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మూడోసారి పదవికి పోటీ చేసే ఉద్దేశ్యం లేదని వెల్లడించారు. దీంతో నవంబర్‌లో అతని స్ధానంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న జై షాను ఎంపిక చేయాలని నిర్ణయించారు. జైషాకు ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మద్దతు ఉంది. దీంతో జై షా ఐసీసీ ఛైర్మన్ కావడం లాంఛనమే.

ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న గ్రెగ్ బార్క్లే 2020 నవంబర్‌లో స్వతంత్ర ఐసీసీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. 2022లో ఆయన తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుత డైరెక్టర్లు ఇప్పుడు 27 ఆగస్టు 2024లోపు తదుపరి ఐసీసీ చైర్మన్ కోసం నామినేషన్లు వేయాలి. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే డిసెంబర్ 1న ప్రారంభమయ్యే కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఛైర్మన్ ఎన్నికలో 16 ఓట్లు ఉంటాయి. ఛైర్మన్ గా ఎన్నిక కావాలంటే విజేతకు తొమ్మిది ఓట్ల సాధారణ మెజారిటీ అవసరం. ఇది జైషాకు నల్లేరుపై నడకే అని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications