అనాథలకు ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్-ఆంధ్రా క్రికెట్ సంఘం దాతృత్వం..!
ఆంధ్రా క్రికెట్ సంఘం మరోసారి తన దాతృత్వం చాటుకుంది. ఐపీఎల్ మ్యాచ్ చూడాలనే అనాథ పిల్లల కోరిక తీర్చింది. అయితే వేలకు వేలు టికెట్లు కొని కాదు.. ఉచితంగానే వారు ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు సాయం చేసింది. ఇందుకోసం ఆంధ్రా క్రికెట్ సంఘం తన సొంత నిధుల్లో నుంచి 30 ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేసి మరీ వారికి ఐపీఎల్ మ్యాచ్ చూపించింది. ఈ అరుదైన ఘటనకు విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికైంది.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఉన్న విశాఖపట్నం స్టేడియంలో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడాలని భావించిన 30 మంది అనాథల కోరిక తెలుసుకున్న ఆంధ్రా క్రికెట్ సంఘం తామే టికెట్లు కొనేందుకు ముందుకొచ్చింది. వాస్తవానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలను అడిగితే ఉచితంగానే వీరికి పాసులు ఇప్పించే వీలుంది. అయినా టికెట్లు కొని మరీ అనాథలకు ఐపీఎల్ మ్యాచ్ చూడాలన్న కోరిక తీర్చింది.

వైజాగ్ లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి 30 టికెట్లు తన సొంత నిధులతో కొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందించింది. మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన చిన్నారులకు ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎసిఎ కార్యదర్శి రాజ్యసభ ఎంపి సానా సతీష్, ఎసిఎ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావాల్సిన సదుపాయాలు దగ్గరుండి చూశారు. కాసేపు వారితో సరదాగా కబుర్లు చెప్పారు. తమకు మ్యాచ్ చూసే అవకాశం కల్పించిన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆ చిన్నారులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.












Click it and Unblock the Notifications