India vs Pakistan : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్- టీమిండియా రెండు మార్పులు..
శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్ తో జరుగుతున్న ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. లీగ్ దశలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో కీలక పోరుకు భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో రోహిత్ సేన రెండు మార్పులు చేసింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రావడంతో మొహమ్మద్ షమీకి విశ్రాంతి నిచ్చారు. అలాగే మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు.

ఈ మ్యాచ్ కోసం తొలుత ఓ మార్పు మాత్రమే చేయాలని కెప్టెన్ రోహిత్ భావించాడు. దీంతో గాయం నుంచి కోలుకున్న బుమ్రా జట్టులోకి వచ్చాడు. అయితే బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు చివరి నిమిషంలో గుర్తించడంతో అతని స్ధానంలో కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకురాక తప్పలేదు. పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇప్పటికే టోర్నీలో ఆడుతున్న జట్టును కొనసాగిస్తున్నట్లు కెప్టెన్ బాబర్ ఆజమ్ తెలిపాడు.
మరోవైపు ఈ కీలక మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వచ్చినా ఆరంభానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. దీంతో మ్యాచ్ ఆరంభం సజావుగా సాగిపోతోంది. నిన్న కురిసిన వర్షానికి పిచ్ కింద నీరు చేరిందని భావిస్తున్నట్లు క్యూరేటర్ తెలిపారు. దీంతో ముందుగా బౌలింగ్ తీసుకుంటే బెటర్ అని టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ భావించాడు. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. అయితే టాస్ ప్రభావం పెద్దగా ఉండబోదనేది భారత కెప్టెన్ రోహిత్ ఆలోచన.
ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ ఫైనల్ చేరే అవకాశాలు ఉండటంతో గెలుపు కీలకంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్ బౌలర్ల నుంచి గట్టిపోటీ ఎదురవుతున్న తరుణంలో భారత టాప్ ఆర్డర్ రాణించడంపైనే టీమిండియా గెలుపు ఆధారపడి ఉంది. ముఖ్యంగా షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్ తో కూడిన పాక్ బౌలింగ్ త్రయాన్ని భారత్ సమర్ధంగా ఎదుర్కొంటే భారీ టార్గెట్ ప్రత్యర్ధి ముందు ఉంచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications