ఇక పాకిస్థాన్ తో క్రికెట్ ఉండదు : బీసీసీఐ సంచలన నిర్ణయం
జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాక పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా, హేయమైన చర్యగా అభివర్ణించాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే పాకిస్థాన్ కు చెక్ పెట్టేందుకు 5 సంచలన నిర్ణయాలు తీసుకుని పాకిస్థాన్ కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది.
అయితే ఈ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఉండబోవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో భారత్ పాక్ మధ్య పోరు చూడాలనే ఫ్యాన్స్ కు కొంత నిరాశ అనే చెప్పొచ్చు.
భారత్- పాకిస్థాన్ మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటినుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతూ వచ్చాయి. అయితే తాజా సంఘటనలతో ఇక భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.

భారత్- పాక్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-13లో జరిగింది. అంతకంటే నాలుగేళ్ల ముందే ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం క్రికెట్ కు అడ్డుచెప్పలేదు. ఇక రెండు నెలల క్రితం జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ, ఆ టోర్నీకి భారత్ వెళ్ల లేదు. దుబాయ్ లో మ్యాచ్ లు ఆడి అక్కడే టైటిల్ కొట్టింది.












Click it and Unblock the Notifications