పాపం.. గిల్ కు షాకుల మీద షాకులు?
టీ20 వరల్డ్ కప్ ఆడబోయే భారత జట్టులో శుభ్‌మన్ గిల్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 15 మంది సభ్యుల జట్టులో అతనికి స్థానం దక్కలేదు. టీ20 ఫార్మట్ లో వైస్ కేప్టెన్‌గా అతనికి ఇటీవలే పదోన్నతి లభించినప్పటికీ ఇప్పుడు ఏకంగా జట్టులో చోటు కోల్పోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పేలవమైన ప్రదర్శన కారణంగా బీసీసీఐ అతన్ని టీ20 ఇంటర్నేషనల్స్ నుండి తొలగించింది.
ఈ పరిణామాల మధ్య గిల్ కు మరో భారీ షాక్ తప్పేట్లు లేదు. వన్డే జట్టు కెప్టెన్సీ కోసం లోయర్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసే అవకాశాలను బీసీసీఐ గట్టిగానే పరిశీలిస్తోంది. ఇదివరకే ఈ హోదా కోసం శ్రేయాస్ అయ్యర్ తెరమీదికి వచ్చినప్పటికీ అది సాధ్యపడలేదు. ఆ ఛాన్స్ గిల్ కు దక్కింది. ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోంది. వన్డేల్లో కూడా శుభ్ మన్ గిల్ ఫామ్ లో లేకపోవడానికి కేప్టెన్సీ బాధ్యతలేనని బీసీసీఐ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మట్లకు గిల్ కేప్టెన్ గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. టీ20 ఇంటర్నేషనల్స్ లో అతనికి వైస్ కేప్టెన్ బాధ్యతల దక్కాయి. మొదట్లో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ గిల్‌ను అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా చేయాలని భావించింది. ఈ క్రమంలోనే అతనికి టీ20ల్లో వైఎస్ కేప్టెన్ హోదా అప్పగించింది. ఏ మాత్రం రాణించివున్నా గానీ ఈ కిరీటం కూడా అతనికే దక్కే ఉండేది. సూర్యకుమార్ యాదవ్ పెద్దగా రాణించకపోవడం అతనికి ప్లస్ పాయింట్ అయివుండేది.
టెస్ట్ తప్పిస్తే వన్డే, టీ20ల్లో గిల్ పెద్దగా సత్తా చాటట్లేదు. దీంతో వన్డే కేప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా అతన్ని తప్పించి.. దాన్ని శ్రేయాస్ అయ్యర్ కు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకుంటే- 2027 వరల్డ్ కప్ వరకు జట్టు కుదురుకుంటుందని భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించాడు శ్రేయాస్ అయ్యర్. అయిదు మ్యాచ్‌లలో 15, 56, 79, 45, 48 పరుగులతో మొత్తం 243 రన్స్ రాబట్టాడు. నిలకడను ప్రదర్శించాడు.
ఇప్పటివరకు 70 వన్డేలు ఆడిన అయ్యర్ 48.22 సగటుతో 2845 పరుగులు సాధించాడు. ఇందులో అయిదు సెంచరీలు ఉన్నాయి. అటు ఐపీఎల్ లో కూడా కోల్ కత నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ను ఫైనల్స్ కు చేర్చగలిగాడు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వన్డే ఫార్మట్ కేప్టెన్ గా గిల్ ను తప్పించి అయ్యర్ ఆ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడొచ్చు.












Click it and Unblock the Notifications