గిదేం ఆట సామీ?: నువ్వు తోపువనుకుంటే తుస్సుమన్నావ్ కదా!
ఐపీఎల్ 2026 సీజన్ కేకేఆర్‌కు ఏ మాత్రం కలిసిరావడం లేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుస పరాజయాలు పలకరించడంతో జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో జట్టులో ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వేలంలో రూ.25.20 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. గ్రీన్ ఆటతీరుపై భారత మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతడిని వెంటనే జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు.
గ్రీన్ వల్ల పైసా ఉపయోగం లేదు: మురళీ కార్తీక్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఓ చర్చా కార్యక్రమంలో మురళీ కార్తీక్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. కామెరూన్ గ్రీన్ జట్టుకు ఓ భారంగా మారాడని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో గ్రీన్ కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడని.. బౌలింగ్లో అసలు ఓవర్లు కూడా వేయడం లేదని గుర్తు చేశారు. ఇంత భారీ మొత్తాన్ని తీసుకుంటున్న ఆటగాడు కనీసం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించలేకపోవడం కేకేఆర్‌కు పెద్ద మైనస్ పాయింట్ అని మురళీ కార్తీక్ మండిపడ్డాడు.

కేకేఆర్ కోసం సరికొత్త వ్యూహం
జట్టును విజయపథంలోకి మళ్లించడానికి మురళీ కార్తీక్ ఓ కొత్త ప్రణాళికను సూచించాడు. వైఫల్యాలతో సతమతమవుతున్న కామెరూన్ గ్రీన్‌ను పక్కనపెట్టి న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మురళీ కార్తీక్ సలహా ఇచ్చాడు. ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే పవర్ ప్లేలో కేకేఆర్‌కు అద్భుతమైన ఆరంభం లభిస్తుందని పేర్కొన్నాడు. గతంలో కివీస్ జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడంలో ఈ జోడీ కీలక పాత్ర పోషించిందని, వారిద్దరికీ ఒకరి ఆటపై ఒకరికి మంచి అవగాహన ఉందని విశ్లేషించాడు. ఒకవేళ సీఫెర్ట్ కాదనుకుంటే రచిన్ రవీంద్ర లేదా రోవ్‌మన్ పావెల్ వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కోరాడు.
రహానే కెప్టెన్సీపై పెరుగుతున్న ఒత్తిడి.. లక్నోతో పోరులో గెలిచేనా?
కేవలం ఆటగాళ్ల ప్రదర్శన మాత్రమే కాకుండా.. కెప్టెన్ అజింక్యా రహానే సారథ్యంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడంలో రహానే విఫలమయ్యాడని, వర్షం కారణంగా తేమగా ఉన్న వికెట్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం అతిపెద్ద తప్పిదమని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. లక్నోతో జరిగే మ్యాచ్‌లో ఐడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్లను అడ్డుకోవడం కేకేఆర్ బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది. మరి ఈ విమర్శల నేపథ్యంలో రహానే జట్టులో మార్పులు చేసి విజయ ఖాతా తెరుస్తాడో లేదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications