CSK అతి చెత్త రికార్డ్- వీళ్ల కంటే SRH ఎంతో నయం
ఈ ఐపీఎల్ సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయంతో ప్రారంభించింది. సోమవారం రాత్రి గువాహటి స్టేడియంలో జరిగిన ఏకపక్ష పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ పరాజయం చెన్నైకి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత భారీ ఓటమిగా నమోదైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం సాధించి అబ్బురపరిచాడు.
అతని విధ్వంసకర ఇన్నింగ్స్ జట్టుకు సునాయాస విజయాన్ని అందించడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను గణనీయంగా పెంచింది. ప్రస్తుతం ఐపీఎల్ టేబుల్ లో టాపర్ గా నిలిచిందీ జట్టు. తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే తడబడ్డారు. నిర్ణీత 19.4 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయ్యారు. గత సీజన్‌లో జట్టును వెంటాడిన బ్యాటింగ్ సమస్యలు ఈ కొత్త సీజన్‌లోనూ కొనసాగాయి. ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో అయిదు సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి.

లోయర్ ఆర్డర్ బ్యాటర్ జేమీ ఓవర్టన్ 36 బంతుల్లో 43 పరుగులు చేసి కాస్త పోరాడగలిగాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (11 బంతుల్లో 6 పరుగులు), సంజు శాంసన్ (7 బంతుల్లో 6 పరుగులు), సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 17 పరుగులు), శివమ్ దూబే (4 బంతుల్లో 6 పరుగులు) వంటి కీలక ఆటగాళ్లు తొందరగా పెవిలియన్ చేరారు. వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టు దెబ్బకొట్టింది.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబరిచారు. చెన్నైని కట్టడి చేశారు. జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా, నాండ్రే బర్గర్ వంటి ప్రధాన బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచారు. వారి పటిష్టమైన బౌలింగ్ విభాగం చెన్నైకి పరుగుల వేగాన్ని పెంచే అవకాశం ఇవ్వలేదు.
128 పరుగులను ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు, బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సూర్యవంశీ మెరుపు అర్ధశతకంతో జట్టు విజయం సునాయాసమైంది. 12.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులు చేసి కంబోజ్ బౌలింగ్‌లో సరఫరాజ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ (9 బంతుల్లో 18 పరుగులు) వేగంగా ఆడాడు.
చివరకు యశస్వి జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ జైత్రయాత్రలో మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ వంటి చెన్నై బౌలర్లు రాజస్థాన్ దూకుడును అడ్డుకోలేకపోయారు. ఈ ఓటమితో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 2023 తర్వాత అత్యధిక మ్యాచ్ లు ఓడిన జట్టుగా నిలిచింది. ఈ మూడు సీజన్లల్లో సీఎస్కే ఖాతాలో 18 అపజయాలు ఉన్నాయి. ఏ జట్టుకైనా ఇదే అత్యధికం.
మిగిలిన జట్లల్లో ముంబై ఇండియన్స్- 17, పంజాబ్ కింగ్స్- 15, సన్ రైజర్స్ హైదరాబాద్- 15, రాజస్థాన్ రాయల్స్- 15, లక్నో సూపర్ జెయింట్స్- 15, గుజరాత్ టైటాన్స్- 13, ఢిల్లీ కేపిటల్స్- 13, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 12, కోల్ కత నైట్ రైడర్స్- 11 మ్యాచ్ లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications