హఠాత్తుగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా స్టార్ బ్యాటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచీ వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారి సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. భావోద్వేగంతో కూడిన సుదీర్ఘ లేఖను రాశాడు.

టీమిండియా జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, గ్రౌండ్ లో అడుగుపెట్టిన ప్రతిసారీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం మాటల్లో చెప్పలేని అనుభవాన్ని మిగిల్చిందని పేర్కొన్నాడు. చాలా కాలంగా భారత టెస్ట్ జట్టులో పుజారాకు చోటు దక్కట్లేదు. బీసీసీఐ యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తోంది.
చివరిసారిగా 2023లో కెన్నింగ్‌టన్ ఓవల్‌లో ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు పుజారా. ఆ తరువాత జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్ లో భారీగా పరుగులు చేసినప్పటికీ- బీసీసీఐ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. అతనికి జట్టు మళ్లీ అవకాశాలను కల్పించలేదు.
ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ జట్టులోకి పుజారా తిరిగి వస్తాడని ఊహాగానాలు చెలరేగాయి. సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు మొగ్గు చూపారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత,- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫార్మాట్ నుండి తప్పుకొన్నారు.
ఈ పరిస్థితుల మధ్య జాతీయ జట్టులోకి పునరాగమనం అసాధ్యమని భావించిన నేపథ్యంలో చేతేశ్వర్ పుజారా.. రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అన్నింటికీ ముగింపు ఉంటుందని, తన కేరీర్ ను ముగిస్తోన్నానని చెప్పాడు.
తన కెరీర్‌లో అండగా నిలిచిన సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, మిత్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పుజారా పేర్కొన్నాడు. రాజ్‌కోట్ అనే చిన్న టౌన్ నుండి వచ్చిన ఓ పిల్లాడిగా, తల్లిదండ్రులతో కలిసి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, భారత క్రికెట్ జట్టులో భాగం కావాలని కలలు కన్నానని అన్నాడు.
క్రికెట్.. తన ఎంతో ఇస్తుందని అప్పుడు ఊహించలేదని పుజారా చెప్పాడు. ఇన్ని అమూల్యమైన అవకాశాలు, అనుభవాలు, అభిమానులు ప్రేమాదరణ- అన్నింటికంటే ఎక్కువగా సొంత రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిథ్యాన్ని వహించే అవకాశం ఇచ్చిందని పుజారా భావోద్వేగంగా వివరించాడు.
బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు పుజారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. మార్గదర్శకులు, కోచ్‌లు, ఆధ్యాత్మిక గురువుల అమూల్యమైన మార్గదర్శకత్వం లేకుండా తాను ఇంత దూరం వచ్చి ఉండేవాడిని కాదని పేర్కొన్నాడు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నాడు.
తల్లిదండ్రులు, భార్య పూజ, కుమార్తె అదితి, అత్తమామలు.. తన కేరీర్ లో ఎదుగుదలకు ఎంతగానో కృషి చేశారని, తన కోసం అసంఖ్యాక త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నాడు. వారి అండదండలు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదని వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications