ప్లేఆఫ్స్ హీరోలకు వరుస షాక్స్
Punjab Kings vs Delhi Capitals: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్.. దూకుడుకు బ్రేక్ పడింది. తిరుగులేని విజయాలను అందుకుంటోన్న ఈ జట్టుకు చుక్కెదురైంది. ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఘోర ఓటమిని చవి చూసింది. లీగ్స్ లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో మట్టికరిచింది.
ప్లేఆఫ్స్ చేరిన మూడు జట్లు.. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తమ ప్రత్యర్థుల చేతుల్లో చావుదెబ్బ తిన్నాయి. తొలుత గుజరాత్ టైటాన్స్ జోరుకు లక్నో సూపర్ జెయింట్స్ కళ్లెం వేసింది. ఆ తరువాత రాయల్ ఛాలెంజర్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్.. నేలకు దించింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కు చుక్కలు చూపించింది ఢిల్లీ కేపిటల్స్.

జైపూర్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. తొలుత బ్యాటింగ్ కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది పీబీకేఎస్. అనంతరం ఛేజింగ్ కు దిగిన ఢిల్లీ కేపిటల్స్ ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే 208 పరుగులు బాదింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లనే కోల్పోయింది.
ఇంత భారీ స్కోర్ చేసినప్పటికీ మ్యాచ్ ను కాపాడుకోలేకపోయింది శ్రేయాస్ అయ్యర్ టీమ్. బౌలర్లందరూ సమష్టిగా విఫలం అయ్యారు. హర్ ప్రీత్ బ్రార్- 2 వికెట్లు పడగొట్టగా.. మార్కొ జన్ సెన్, ప్రవీణ్ దుబే ఒక్కో వికెట్ తీసుకున్నారు.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్ లో కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టొయినిస్ బ్యాటింగ్ హైలైట్స్. 34 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 53 పరుగులు కొట్టాడు శ్రేయాస్. కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. స్టొయినిస్ వీర విహారం చేశాడు. 16 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య- 6, ప్రభ్ సిమ్రన్ సింగ్- 28, టాప్ ఆర్డర్ బ్యాటర్ జోస్ ఇంగ్లీస్- 32, నేహాల్ వధేరా- 16, శశాంక్ సింగ్- 11, అజ్మతుల్లా ఒమర్జాయ్- 1, జన్ సెన్ డకౌట్ అయ్యారు. ఢిల్లీ బౌలర్లల్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కుల్ దీప్ యాదవ్, మిప్రాజ్ నిగమ్ రెండేసి చొప్పున, ముఖేష్ కుమార్ ఓ వికెట్ తీసుకున్నారు.
ఢిల్లీ ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ శుభారంభం అందించారు జట్టుకు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 5.3 ఓవర్లల్లో 55 పరుగులు జోడించారు. రాహుల్- 35, ఫాఫ్- 23 పరుగులు చేశారు. దీన్ని మిగిలిన బ్యాటర్లు కొనసాగించారు. కరుణ్ నాయర్- 44, సెదికుల్లా అటల్- 22, సమీర్ రిజ్వీ- 58, ట్రిస్టన్ స్టబ్స్- 18 పరుగులతో చెలరేగడంతో ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది ఢిల్లీ.












Click it and Unblock the Notifications