ప్రముఖులకు ఈడీ షాక్: సోనూ సూద్ సహా మాజీ క్రికెటర్లకు సమన్లు
మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, ప్రముఖ నటుడు సోనూ సూద్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించి వీరిని విచారించనున్నారు. ఈడీ అధికారుల ప్రకారం, '1ఎక్స్‌బెట్' అనే బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ నివారణ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి ఈ ముగ్గురిని వచ్చే వారం విచారణకు పిలిచారు. రాబిన్ ఉతప్ప సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని సమన్లు అందుకోగా.. యువరాజ్ సింగ్ సెప్టెంబర్ 23న హాజరుకానున్నారు. సోనూ సూద్ సెప్టెంబర్ 24న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.
ఇప్పటికే ఈడీ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లను ఇదే కేసులో విచారించింది. అంతేకాకుండా, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి వాంగ్మూలాన్ని కూడా ఈడీ రికార్డు చేసింది. ఈ కేసులో భాగంగా బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా మంగళవారం ఈడీ ముందు హాజరు కాగా.. '1ఎక్స్‌బెట్'కు భారత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నటి ఊర్వశి రౌతేలా మాత్రం హాజరుకాలేదు.

ఈడీ దర్యాప్తు ఎందుకు?
అక్రమ బెట్టింగ్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్‌లు పెట్టుబడిదారులను, సామాన్య ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల మేర మోసాలకు పాల్పడ్డాయని, అలాగే భారీగా పన్ను ఎగవేతలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఈ ఉల్లంఘనలను గుర్తించడానికి అధికారులు ఈ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
18 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న '1ఎక్స్‌బెట్' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బెట్టింగ్ యాప్ అని ఆ కంపెనీ పేర్కొంది. దీని వెబ్‌సైట్, యాప్ 70 భాషలలో అందుబాటులో ఉన్నాయని, లక్షల మంది వినియోగదారులు ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా బెట్టింగ్‌లు పెడుతున్నారని వివరించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పంపిన డబ్బును అక్రమ సంపాదనను చట్టబద్ధం చేయడానికి ఉపయోగించారా, లావాదేవీలు, గెలుపుపై సరైన పన్ను లెక్కలు ఉన్నాయా అనే విషయాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications