ప్లేఆఫ్స్ ఫుల్ టైట్: ఒకటే బెర్త్- రేసులో మూడు జట్లు
ఐపీఎల్ లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ ను ఏడు వికెట్లతో మట్టికరిపించింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్.. 197 పరుగులను అలవోకగా అందుకుంది. 18 ఓవర్లలోనే ఊదిపడేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు.
ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి ఈ గెలుపు పంజాబ్‌కు అత్యవసరం కూడా. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇందులో రాజస్థాన్ గెలిస్తే పంజాబ్ ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ కేకేఆర్ గెలిస్తే, నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. పంజాబ్ ప్రస్తుతం 14 మ్యాచ్‌లలో 7 విజయాలతో 15 పాయింట్లను సొంతం చేసుకుంది. పంజాబ్ గెలుపుతో లక్నో సూపర్ జెయింట్స్ 14 మ్యాచ్‌లలో 8 పాయింట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.

ఇన్నింగ్ ప్రారంభంలో పంజాబ్ కింగ్స్ తడబడింది. మహమ్మద్ షమీ ఇన్నింగ్స్ తొలి బంతికే ప్రియాంష్ ఆర్య అవుట్ అయ్యాడు. అర్జున్ టెండుల్కర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం ఫామ్‌లో ఉన్న కూపర్ కోనలీని కూడా షమీ అవుట్ చేయడంతో లక్నో ఆధిక్యత సాధించినట్టు కనిపించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్, అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఆ భాగస్వామ్యమే ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ప్రభ్‌సిమ్రన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌కు సూర్యాంష్ షెడ్గే తోడ్యాడు. పంజాబ్‌ను గెలిపించారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో లక్నో, పంజాబ్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లలో తలపడగా ఎల్ఎస్జీ మూడు, పంజాబ్ అయిదు మ్యాచ్‌లలో విజయం సాధించాయి.
నేడు తుది డబుల్ హెడర్. ప్లేఆఫ్స్ చివరి స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నాలుగో స్థానం కోసం పంజాబ్ (14 మ్యాచ్‌లు, 7 విజయాలు, 1 టై, 15 పాయింట్లు, నెట్ రన్ రేట్ 0.309 ), రాజస్థాన్ రాయల్స్ (13 మ్యాచ్‌లు, 7 విజయాలు, 14 పాయింట్లు, నెట్ రన్ రేట్ 0.083), కేకేఆర్ (13 మ్యాచ్‌లు, 6 విజయాలు, 1 టై, 13 పాయింట్లు, నెట్ రన్ రేట్ 0.011) పోటీ పడుతున్నాయి. మిగిలిన జట్లు నిష్క్రమించాయి.
నేడు వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే, ఇతర ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడినా, లేదా అది రద్దయినా, వారు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది.
పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ పై ఆధారపడకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే, వారికి రెండు అనుకూల ఫలితాలు అవసరం. అవి: ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించాలి, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించాలి.
కోల్‌కతా నైట్ రైడర్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతాలో తలపడనుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి, కేకేఆర్ 15 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ తో సమంగా నిలిస్తే, నెట్ రన్ రేట్ పరంగా పంజాబ్‌ను అధిగమించడం కష్టమే అవుతుంది. కేకేఆర్ కనీసం 77 పరుగుల తేడాతో గెలవాలి, లేదా లక్ష్యాన్ని 12.1 ఓవర్లలోపు ఛేదించాలి. ముంబై, రాజస్థాన్‌ను ఓడించినా పంజాబ్ కింగ్స్ నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications