మూడు విజయాలు- ఆరు పాయింట్లు: కింగ్ ఆఫ్ ఛేజింగ్
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మూడు విజయాలతో ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. భారత్ తరువాత న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
టీమిండియా ప్రదర్శిస్తోన్న ఈ దూకుడు చూస్తోంటే- నాలుగో విజయం సునాయాసమే అవుతుంది. తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన. ఈ నెల 19వ తేదీన పుణేలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రత్యర్థి జట్టు ఆశించిన స్థాయిలో బలంగా లేకపోవడం వల్ల వరుసగా నాలుగో విజయంపై భారత జట్టు కన్నేసినట్టే.

ఈ నెల 8వ తేదీన చెన్నై చెపాక్ స్టేడియంలో మొదలైంది టీమిండియా జైత్రయాత్ర. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. లో- స్కోర్ మ్యాచ్ ఇది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 199 పరుగులకే చాప చుట్టేయగా.. ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది భారత్. ఓపెనర్లు విఫలమైనప్పటికీ- విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
మలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసింది ఆఫ్ఘన్. ఆ జట్టు నిర్దేశించిన 272 పరుగులను భారత్ అలవోకగా అందుకుంది. ఈ క్రమంలో రెండు వికెట్లనే కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు కేప్టెన్ ప్లస్ ఓపెనర్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇక తాజాగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 పరుగులకే చతికిలపడింది. ఇక్కడా ఛేజింగే. ఈ స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి కొట్టేసింది. ఏడు వికెట్లతో విజయదుందుభి మోగించింది. ఈ మూడింట్లోనూ టీమిండియా రెండోసారి బ్యాటింగ్ చేసింది. ఛేజింగ్ కింగ్ అనిపించుకుంది.












Click it and Unblock the Notifications