రేట్లు గిట్ల పెంచిన్రేంది- ఇగ IPL మ్యాచులు ఎట్ల చూడాలె
జీఎస్టీలో కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలను చేపట్టింది. రీవ్యాంప్ చేసింది. ఫలితంగా స్లాబ్‌లు భారీగా తగ్గాయి. ఇదివరకు ఉన్న శ్లాబ్ ల వ్యవస్థ తొలగిపోయాయి. రెండు శ్లాబ్స్ మాత్రమే మిగిలియి. 5, 18 శాతం శ్లాబులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త విధానం ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ జీఎస్టీ శ్లాబ్ లను ప్రకటించారు.
మెజారిటీ వస్తువులు 5, 18 శాతం శ్లాబ్‌లలోకి రావడం, అనేక వస్తువులు జీరో శాతం పన్ను పరిధిలోకి రావడం వల్ల సామాన్య ప్రజలకు భారీగా ఊరట ఇచ్చినట్టయింది. కొత్త శ్లాబ్ సిస్టమ్ వల్ల ప్రజల వద్ద డబ్బు ఆదా అవుతుందని, అది తిరిగి మరో రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి చేరుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖాజానాకు రూ. 48,000 కోట్ల రెవెన్యూ ఇంప్లికేషన్ ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తోన్నారు.

కొత్త వ్యవస్థ ప్రకారం.. లగ్జరీ, సిన్ గూడ్స్‌కు 40 శాతం ప్రత్యేక శ్లాబ్ పరిధిలోకి రానున్నాయి. ఏరియేటెడ్ వాటర్, కార్బోనేటెడ్ డ్రింక్స్, కెఫిన్- బేస్డ్ డ్రింక్స్,, నాన్-ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఈ శ్లాబ్ పరిధిలోకి వస్తాయి. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్స్, హెలికాప్టర్లు, యాచ్‌లపై కూడా 40 శాతం పన్ను విధిస్తారు. పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, బీడీ, పొగాకు ఉత్పత్తులు కూడా ప్రస్తుతానికి 40 శాతం శ్లాబ్ లోకి మారవు.
ఈ కొత్త సిస్టమ్ వల్ల ఐపీఎల్ టికెట్ల రేట్లు భారీగా పెరగనున్నాయి. స్టేడియాల్లో వీక్షించే క్రికెట్ అభిమానులు ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ టికెట్లపై వసూలు చేస్తోన్న జీఎస్టీ శ్లాబ్ ను 28 నుండి 40 శాతానికి మార్చడమే దీనికి కారణం. ఈ పెంపుతో ఐపీఎల్ టికెట్లు కాసినోలు, లగ్జరీ వస్తువులతో పాటు అత్యధిక పన్ను శ్రేణిలోకి చేరాయి. ఇది దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు మరింత భారంగా మారనుంది.
- స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించడాన్ని ఒక విలాసవంతమైన కార్యకలాపంగా కేంద్ర ప్రభుత్వం పరిగణించింది. అందుకే దీన్ని లగ్జరీ గూడ్స్ కేటగిరీలోకి చేర్చింది.
- ప్రస్తుతం రూ. 1,000 ధర గల ఐపీఎల్ మ్యాచ్ స్టేడియం టికెట్ జీఎస్టీతో కలిపి రూ. 1,280కి లభించేది. ఇప్పుడు అది రూ. 1,400 అవుతుంది. అంటే రూ. 120 పెరుగుదల చోటు చేసుకుంటుంది.
- అలాగే, రూ. 500 టికెట్ ధర రూ. 640 నుండి రూ. 700కి పెరిగింది. రూ. 2,000 టికెట్ ధర రూ. 2,560 నుండి రూ. 2,800కి చేరుకుంది.
- ఇది పొగాకు ఉత్పత్తులు, బెట్టింగ్ కార్యకలాపాలతో సమాన కేటగిరీలో వస్తుంది. నాన్ ఐపీఎల్ అంటే బీసీసీఐ, ఐసీసీ నిర్వహించే సాధారణ క్రికెట్ మ్యాచ్‌లకు ఇది వర్తించదు. అవి ఇప్పటికీ 18 శాతం జీఎస్టీ పరిధిలోనే కొనసాగుతున్నాయి.
- ఐపీఎల్ ప్రేక్షకులకు టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. స్టేడియం ఛార్జీలు, ఆన్‌లైన్ బుకింగ్ ఫీజులు వంటి వాటిని కూడా అభిమానులు ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
- సినిమా ప్రియులకు కొంత ఊరట లభించింది. రూ. 100 వరకు ధర ఉన్న సినిమా టికెట్లకు గతంలో 12 శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో 5 శాతానికి తగ్గింది. రూ. 100 పైబడిన టికెట్లకు 18 శాతం జీఎస్టీ రేటు మారదు.












Click it and Unblock the Notifications