చరిత్ర సృష్టించిన కుర్రాళ్లు.. ఆరోసారి ఫైనల్‌కు భారత్!
అండర్-19 ప్రపంచ కప్‌లో భారత యువ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా ఆరోసారి.. మొత్తంగా 10వ సారి వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 6న జరగనున్న తుదిపోరులో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ తలపడనుంది.
వరల్డ్ కప్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఛేదన
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 41.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి. అంతకుముందు 2006లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ సాధించిన 305 పరుగుల ఛేదన రికార్డును భారత్ ఇప్పుడు తిరగరాసింది.

మెరిసిన ఓపెనర్లు.. ఆరోన్ జార్జ్ సెంచరీ హైలైట్
భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వైభవ్ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. మొత్తంగా 33 బంతుల్లో 68 పరుగులు (9 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి ఆరోన్ జార్జ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఆరోన్ జార్జ్ 104 బంతుల్లో 115 పరుగులతో (15 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ ఆయుష్ కూడా 62 పరుగులతో రాణించగా.. వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా (38 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు.
పోరాడిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ కూడా అద్భుతంగా ఆడింది. ఆ జట్టులో ఫైసల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజై (101 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో కనిష్క చౌహాన్ 2 వికెట్లు పడగొట్టగా, దీపేష్ దేవేంద్రన్ ఒక వికెట్ సాధించాడు. భారీ స్కోరు చేసినప్పటికీ, భారత బ్యాటర్ల ధాటికి ఆఫ్ఘన్ బౌలర్లు నిలవలేకపోయారు.
టోర్నీలో భారత్ అజేయ ప్రస్థానం
ఈ ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సూపర్-6లో జింబాబ్వే, పాకిస్తాన్‌లను చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో సమరానికి సిద్ధమైంది. ఇప్పటికే 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఇప్పుడు ఆరోసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది.












Click it and Unblock the Notifications