టీమిండియాలో ది బెస్ట్ ఫినిషర్: ప్రూవ్ చేసిన వైజాగ్ మ్యాచ్
విశాఖపట్నం: ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఛాంపియన్ ఆస్ట్రేలియాకు తొలి పరాభవం ఎదురైంది. విశాఖపట్నంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయిందా జట్టు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అయిదు టీ20 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. 1-0 తేడాతో ఆధిక్యతలో నిలిచింది.
టాస్ ఓడిపోయి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. బౌలర్లు సమష్టిగా విఫలం అయ్యారీ మ్యాచ్‌లో. ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ము రేపారు. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ సెంచరీతో కదం తొక్కాడు. 50 బంతుల్లో 11 ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్లతో 110 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 19.5 ఓవర్లల్లో ఈ టార్గెట్‌ను ఛేదించింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కొత్త సారథి సూర్యకుమార్ యాదవ్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. కేప్టెన్సీ ఒత్తిడి ఉన్నప్పటికీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్- 58 పరుగులతో అతనికి అండగా నిలిచాడు.
చివరి ఓవర్‌లో హైడ్రామా నడిచింది. ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆ ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు పడ్డాయి. వారిలో ఇద్దరు రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ అయ్యారు.

ఆ ఓవర్ మూడో బంతికి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. 4,5 బంతుల్లో రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ కావడం జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దశలో సీన్ అబాట్ వేసిన నో బాల్‌ను ఫోర్‌గా మలిచాడు రింకూ సింగ్. జట్టును విజయతీరాలకు చేర్చాడు. 14 బంతుల్లో నాలుగు ఫోర్లతో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్ (Rinku Singh) మరోసారి సత్తా చాటాడు. బెస్ట్ ఫినిషర్‌గా నిలిచాడు. ధోని తరువాత మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్నోడిగా గుర్తింపు పొందాడు. ఎలాంటి ఒత్తిడిలో అయినా, ఏ పొజిషన్‌లో అయినా, ఎలాంటి మ్యాచ్‌ను అయినా గెలిపించే సత్తా ఉన్నోడిగా అభిమానులు అతణ్ని ఆకాశానికెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications