గౌతమ్ గంభీర్‌కు బిగ్ షాక్- ఆ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన సెలెక్టర్లు
IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్- వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లల్లో 2-1తో వెనుకంజలో ఉంది. ప్రత్యేకించి- మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ముగిసిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అవమానకర ఓటమిని చవి చూడాల్సొచ్చింది.
ఈ బీజీటీ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది టీమిండియా. రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. మూడో టెస్ట్ డ్రాగా ముగియగా.. నాలుగో దాంట్లో మళ్లీ పాత పాటే పాడింది. పరాజయాలకు అలవాటు పడ్డామనే విషయాన్ని బహిర్గతం చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. వంటి కొమ్ములు తిరిగిన బ్యాటర్లు సైతం మట్టికరిచారీ గేమ్‌లో.

ఈ పరిస్థితుల మధ్య చివరిదైన అయిదో టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధమౌతోంది భారత్. జనవరి 3వ తేదీన ఆరంభం కానుందీ గేమ్. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. ఇందులో గెలిస్తే గానీ సిరీస్ సమం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో భారత్ విజయకేతనం ఎగురవేస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. మెల్‌బోర్న్ నుంచి ఇప్పటికే సిడ్నీకి చేరుకుంది జట్టు. నెట్ సెషన్స్‌లో పాల్గొంటోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోంది. జట్టు ప్లేయర్లందరూ అందుబాటులో ఉన్నారు. కఠోరంగా శ్రమిస్తోన్నారు.
ఈ పరిస్థితుల్లో టెస్ట్ స్పెషలిస్ట్, వెటరన్ ఓపెనర్ చేతేశ్వర్ పుజారాపై దృష్టి సారించాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. అయిదో టెస్ట్ మ్యాచ్ ఆడే తుదిజట్టులో అతనికి చోటు కల్పించాలని భావిస్తోన్నాడు. దీనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్లతోనూ మంతనాలు సాగించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. టాప్ ఆర్డర్ విఫలమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పుజారా జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు.
పుజారాను జట్టులోకి తీసుకోవాలంటూ గౌతమ్ గంభీర్.. సెలెక్టర్లను కోరాడని, దీనికి వాళ్లు అంగీకరించలేదని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది. టెస్ట్ మ్యాచ్‌లల్లో అతనికి ఉన్న అపార అనుభవాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని గంభీర్ అభిప్రాయపడినప్పటికీ- సెలెక్టర్లు మాత్రం దీన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చారని పేర్కొంది.
టీమిండియా తరఫున వందకు పైగా టెస్ట్ మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉంది పుజారాకు. 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ తరువాత అతను జట్టుకు దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాపై జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఓడిపోయింది భారత్. ఈ మ్యాచ్‌లో అతను విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్‌లో 14, రెండో ఇన్నింగ్‌లో 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.












Click it and Unblock the Notifications