రోహిత్ శర్మ అవుట్- కొత్త కేప్టెన్‌గా కేఎల్ రాహుల్?: ఆకలితో ఉన్నారు..!!
India's tour of Australia: భారత జట్టు మొన్నటివరకు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో బిజీగా గడిపింది. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో దారుణంగా పరాజయాన్ని చవి చూసింది. వైట్ వాష్‌కు గురైంది. 3-0 తేడాతో మట్టికరిచింది. కనీస పోరాట పటిమ కూడా ప్రదర్శించలేకపోయింది టీమిండియా.
ఈ మూడింట్లోనూ న్యూజిలాండ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత బెంగళూరులో విజయఢంకా మోగించింది. అనంతరం పుణే, ఆ తరువాత వాంఖెడే టెస్ట్‌లల్లో భారత్‌ను ఓడించింది. ఈ ఓటమి ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దిగజారాల్సి వచ్చింది భారత్‌కు.

ఈ పరిస్థితుల మధ్య ఆస్ట్రేలియాతో తలపడటానికి రెడీ అయింది. ఆ దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే విడుదల చేసింది కూడా.
తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీన జరుగుతుంది. దీనికి పెర్త్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:20 నిమిషాలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండో టెస్ట్- డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్, మూడో మ్యాచ్- 14వ తేదీన బ్రిస్బేన్, 4వ మ్యాచ్- 26వ తేదీన మెల్‌బోర్న్‌లో షెడ్యూల్ అయ్యాయి. చివరి టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉంటుంది. దీనికి సిడ్నీ వేదిక.
ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీమిండియా. శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికి అవసరమైన కసరత్తు చేస్తోంది. న్యూజిలాండ్ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాన్ని అధిగమించి, ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవడం, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని చేరుకోవాలని భావిస్తోంది.
ఈ పరిణామాల మధ్య తొలి టెస్ట్‌కు కేప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. జట్టుతో పాటు అతను ఆస్ట్రేలియాకు వెళ్లట్లేదని తెలుస్తోంది. రెండో టెస్ట్ నాటికి జట్టుతో కలుస్తాడని అంటున్నారు. కొంత విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు.
రోహిత్ శర్మ గైర్హాజర్ పట్ల హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు కేప్టెన్సీ అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పారు. రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయంగా జట్టులో కేఎల్ రాహుల్ ఉన్నాడని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, వారిద్దరూ పెట్టని కోటలని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ అపారమైన క్రికెట్‌ను ఆడగల శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని గౌతమ్ గంభీర్ అన్నారు. ఎంతో సాధించాలనే తపన వారిలో కనిపిస్తోందని, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఓడిన తరువాత దెబ్బతిన్న పులుల్లా ఉన్నారని, పరుగులు సాధించాలనే ఆకలితో ఉన్నారని గంభీర్ అన్నారు.












Click it and Unblock the Notifications