భారత్ కు దెబ్బ మీద దెబ్బ- మరో బౌలర్ అవుట్
ఇంగ్లాండ్ తో జరుగుతున్న అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్ వెనుకంజలో ఉంది. గెలిచాల్సిన మూడో మ్యాచ్ ఘోరంగా ఓడిపోయింది. చేతుల దాకా వచ్చిన మ్యాచ్ ను నోటి దాకా తీసుకెళ్లడంలో విఫలమైంది. 22 పరుగుల తేడాతో మట్టికరిచింది. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తేడాతో వెనుకపడింది.
ఈ పరిస్థితుల మధ్య నాలుగో టెస్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది భారత్. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన ఆరంభం కానుంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం దీనికి వేదిక. ఇంకో రెండురోజుల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లాండ్ తో తలపడబోయే జట్టులో భారీ మార్పులకు టీమ్ మేనేజ్మెంట్ తెర తీసింది.

జట్టులో కొత్త ముఖానికి చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంభోజ్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నుంచి పిలుపు అందింది. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ లో ఈ యంగ్ అండ్ డైనమిక్ పేస్ బౌలర్ ను ఆడించే అవకాశాలు లేకపోలేదు. మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత జట్టులో చేరాడు.
ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు గాయం కావడం వల్ల.. అతని స్థానంలో అన్షుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే అన్షుల్ మాంచెస్టర్‌కు బయలుదేరాడు కూడా. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో సాయి సుదర్శన్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో అర్ష్‌దీప్ గాయపడ్డాడు. అతని చేతికి కుట్లు కూడా పడ్డాయి.
అంతే కాకుండా లార్డ్స్ టెస్టులో గాయపడిన మరో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కూడా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. బ్యాక్ ఇంజ్యూరీతో అతను బాధపడుతున్నాడు. తుదిజట్టులో చోటు దక్కడం అనుమానమేనని సమాచారం. ఇద్దరు కీలక బౌలర్లు ఆడకపోవడం టీమిండియాకు విఘాతంలా మారింది.
రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆకాష్ దీప్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రెండు ఇన్నింగ్స్ లల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్ భారత్ వశం కావడంలో కీలకంగా మారాడు. తొలి ఇన్నింగ్ లో నాలుగు, రెండో ఇన్నింగ్ లో ఆరు వికెట్లు నేలకూల్చాడు. వెన్నునొప్పి వల్ల అతను అందుబాటులో ఉండకపోవచ్చు.
ఆకాష్ దీప్ స్థానంలో అన్షుల్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన ఇండియా ఎ జట్టులో అన్షుల్ సభ్యుడు. ఆ రెండు మ్యాచ్‌లలో అయిదు వికెట్లు సైతం పడగొట్టాడు. ఇంగ్లాండ్ పిచ్ లపై అతనికి మంచి అవగాహన ఉంది. దీంతో అతన్ని జట్టులోకి తీసుకుంది బీసీసీఐ.












Click it and Unblock the Notifications