ఇంగ్లాండ్ పై స్పిన్నాస్త్రం- టీమిండియాలో స్టార్ బౌలర్?
IND vs ENG 4th test: ఇంగ్లాండ్ తో జరుగుతున్న అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్ వెనుకంజలో ఉంది. గెలవాల్సిన మూడో మ్యాచ్ ఘోరంగా ఓడిపోయింది. చేతులకు అందిన మ్యాచ్ ను నోటి దాకా తీసుకెళ్లడంలో విఫలమైంది. 22 పరుగుల తేడాతో మట్టికరిచింది. అయిదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో 2-1 తేడాతో వెనుకపడింది.
ఈ పరిస్థితుల మధ్య నాలుగో టెస్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది భారత్. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన ఆరంభం కానుంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో గెలిచి.. సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. దీనికోసం నెట్స్ లో చెమటోడుస్తోంది.

ఇంకో రెండురోజుల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఒక్కొక్కరు బౌలర్ గాయాల బారిన పడుతున్నారు. సిరీస్ నుంచి తప్పుకొంటోన్నారు. దీని ప్రభావం జట్టు కూర్పు, బ్యాటింగ్ లైనప్ పై తీవ్రంగా పడుతోంది. తుదిజట్టు ఎంపిక కష్టతరమౌతోంది.
ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్ గాయంతో బాధపడుతున్నాడు. గురువారం నాడు ప్రాక్టీస్ సెషన్‌లో సాయి సుదర్శన్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో అతను గాయపడ్డాడు. ఎడమ చేతికి గాయమైంది. దీనికి కుట్లు కూడా పడ్డాయి. ఫలితంగా- అతని స్థానంలో అన్షుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
అంతే కాకుండా లార్డ్స్ టెస్టులో గాయపడిన మరో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కూడా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదు. బ్యాక్ ఇంజ్యూరీతో అతను బాధపడుతున్నాడు. తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. ఇద్దరు ప్రధాన బౌలర్లు ఆడకపోవడం టీమిండియాకు విఘాతంలా మారింది.
ఆకాష్ దీప్ స్థానంలో అన్షుల్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన ఇండియా ఎ జట్టులో అన్షుల్ సభ్యుడు. ఆ రెండు మ్యాచ్‌లలో అయిదు వికెట్లు సైతం పడగొట్టాడు. ఇంగ్లాండ్ పిచ్ లపై అతనికి మంచి అవగాహన ఉంది. దీంతో అతన్ని జట్టులోకి తీసుకుంది బీసీసీఐ.
ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది టీమిండియాకు. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటన నుంచి నిష్క్రమించనున్నాడు. ఆదివారం జిమ్‌లో శిక్షణ పొందుతుండగా అతనికి గాయమైంది. మోకాలి లిగమెంట్ దెబ్బతిన్నట్లు స్కానింగ్‌లో తేలింది.
ఈ పరిణామాల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం స్టార్ స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. మాంచెస్టర్ మ్యాచ్ అతన్ని ఆడించడం దాదాపుగా ఖాయమైనట్టే. టీమిండియా తుదిజట్టులో అతనికి చోటు దక్కడం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. స్పెషలిస్ట్ స్నిన్నర్ గా తడాఖా చూపించనున్నాడు.
ఇప్పటివరకు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లకూ అందుబాటులో లేడీ చైనామన్ బౌలర్. అతనికి ఆ అవకాశం రాలేదు. జస్ ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి బౌలర్లు, ఆల్ రౌండర్లు ఉండటంతో జట్టు సమతూకంలో కనిపించింది.
ఇప్పుడా పరిస్థితి లేదు. ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేరు. ఆకాష్ దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్ రీప్లేస్ అయ్యాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి స్థానాన్ని కుల్ దీప్ యాదవ్ భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ బ్యాటర్లు కుల్ దీప్ బౌలింగ్ ను ఎదుర్కొనకపోవడం ప్లస్ పాయింట్.












Click it and Unblock the Notifications