టీమిండియాకు ముచ్చెమటలు- పాకిస్తాన్ తో ఇలా ఆడితే పరువు పోతుంది
ఆసియా కప్ 2025 ఎట్టకేలకు టీమిండియా.. తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రతి పరుగునూ కాపాడుకునేలా చెమటోడ్చింది. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఏకపక్షంగా నెగ్గుతూ వచ్చిన జట్టుకు ఆరో మ్యాచ్ మాత్రం చుక్కలు చూపించింది. 200లకు పైగా స్కోర్ చేసినా గానీ ఓటమి అంచుల వరకూ వెళ్లాల్సొచ్చింది. చివరికి- సూపర్ ఓవర్‌లో గట్టెక్కింది భారత జట్టు.
సూపర్ 4లో శ్రీలంకతో జరిగిన చిట్టచివరి మ్యాచ్ ఇదే. పాకిస్తాన్ తో ఫైనల్ కు ముందు భారత జట్టుకు శ్రీలంక బిగ్ ఝలక్ ఇచ్చినట్టయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ- 61, తిలక్ వర్మ- 49 (నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. సంజూ శాంసన్- 39, అక్షర్ పటేల్- 21 (నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో జట్టు స్కోర్ 202కు చేరింది.

శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ, దుష్మంత్ చమీర, వానిందు హసరంగ, డాసన్ షనక, చరిత్ అసలంక చెరో వికెట్ తీశారు. అనంతరం శ్రీలంక ఎదురుదాడికి దిగింది. టీమిండియా బౌలింగ్ ను తుత్తునీయలు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులతో స్కోర్ ను సమం చేసింది. ఓపెనర్ పథుమ్ నిశ్శంక 58 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో దుమ్ము దులిపాడు. సెంచరీతో చెలరేగాడు. 107 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా (32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58 పరుగుతో సత్తా చాటాడు. డాసన్ షనక 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22తో చివర్లో సునామీ ఇన్నింగ్ ఆడటంతో స్కోర్ సమమైంది.
హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్ దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. వికెట్ పడగొట్టారు గానీ భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. ఓవర్ కు అర్ష్ దీప్ సింగ్- 11.50, హర్షిత్ రాణా- 13.50, అక్షర్ పటేల్- 10.66 పరుగులు ఇచ్చారు.
సూపర్ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కుశాల్ పెరీరా, డాసన షనక బ్యాటింగ్ కు దిగారు. వారిద్దరూ డకౌట్ అయ్యారు. కమిందు మెండిస్ తీసిన ఒక పరుగు, వైడ్ గా వచ్చిన మరో రన్ తో సూపర్ ఓవర్ లో శ్రీలంక రెండు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్, గిల్ క్రీజ్ లో దిగారు. తొలిబంతికే మూడు పరుగులు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు సూర్య.
పాకిస్తాన్ తో ఫైనల్ కు ముందు.. టీమిండియా ఓ గట్టి మ్యాచ్ ను ఎదుర్కొంది. బ్యాటింగ్, బౌలింగ్ లోపాలు వెలుగులోకి వచ్చాయి. రికవరీకి మాత్రం గడువు లేదు. ఆదివారమే ఫైనల్. బౌలింగ్ డిపార్ట్ మెంట్ ను మరింత బలోపేతం చేసుకోవాల్సి వచ్చిందని, లోపాలను సరి చేసుకంటామని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.












Click it and Unblock the Notifications