రో-కో లేకపోతే టీమిండియా పని శ్రీలంకేనా?
IND vs ZIM: అయిదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవి చూసింది. 13 పరుగుల తేడాతో మట్టికరిచింది. ఈ విజయంతో ఈ సిరీస్‌లో జింబాబే 0-1 తేడాతో ఆధిక్యత సాధించింది. రెండో మ్యాచ్ ఈ సాయంత్రం 4:30 గంటలకు హరారెలో జరుగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. టీమిండియా బౌలర్ల ధాటికి నిలువలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ వెస్లీ మధెవెర- 21, బ్రియాన్ బెన్నెట్- 22, కేప్టెన్ సికందర్ రజా- 17, డియాన్ మేయర్స్- 23, క్లైవ్ మదండే- 29 పరుగులు చేశారు.

టీమిండియా బౌలర్లల్లో రవి బిష్ణోయ్ సత్తా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అతను బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్‌ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్- 2, ముఖేష్ కుమార్- 1, అవేష్ ఖాన్- 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 102 పరుగులకే ఆలౌట్ అయింది. సికందర్ రజా, తెండై ఛతారా బౌలింగ్ ధాటికి నిలవలేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో అన్నీ సింగిల్ డిజిట్లే కనిపించాయి. ముగ్గురు మినహా మిగిలిన వారెవరూ కూడా పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఇది అతని తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. ఐపీఎల్ 2024లో అతను ఆడిన తీరును చూసి సెలెక్టర్లు ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు గానీ దాన్నిసద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఐపీఎల్ స్టార్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్- 7, రియాన్ పరాగ్- 2, రింకూసింగ్- 0, ధృవ్ జురెల్- 6, రవి బిష్ణోయ్- 9, ముఖేష్ కుమార్- 0, ఖలీల్ అహ్మద్- 0 (నాటౌట్) ఇలా ఏ ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. కేప్టెన్ శుభ్‌మన్ గిల్- 31, వాషింగ్టన్ సుందర్- 27, అవేష్ ఖాన్- 16 మాత్రమే కొంతమేర జింబాబ్వే బౌలర్లను ప్రతిఘటించగలిగారు.
ఈ ఓటమిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సి వస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. వారిద్దరూ లేకపోతే టీమిండియా క్రమంగా శ్రీలంక తరహాలో తయారైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడ్డారు.
కుమార సంగక్కార, మహేళ జయవర్దనె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత శ్రీలంక జట్టు ఆటతీరు పాతాళానికి పడిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని గుర్తు చేస్తోన్నారు. ఐపీఎల్ పులులు.. ఇంటర్నేషనల్స్‌లో, పైగా జింబాబ్వే వంటి టీమ్‌పై చేతులెత్తేశారంటూ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications