Ind vs Zim T20I: వైభవ్ మెరుపులతో భారత్ సూపర్ విక్టరీ- శ్రేయస్ బోణీ..!
వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాకు (India) భారీ ఊరట. జింబాబ్వే టూర్ లో భాగంగా ఇవాళ హరారేలో తొలి టీ20 మ్యాచ్ ఆడిన భారత్.. బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ మెరుపుల సాయంతో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తద్వారా టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. అంతే కాదు కెప్టెన్సీ తీసుకున్నా విజయాలు దక్కక ఇబ్బందులు పడుతున్న శ్రేయస్ అయ్యర్ కూడా బోణీ కొట్టాడు. దీంతో భారత అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
హరారేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు షాకిచ్చారు. ఆరంభంలోనే వరుస వికెట్లు తీశారు. దీంతో సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే ఆ తర్వాత 19 పరుగుల వద్ద రెండు వికెట్, 20 పరుగుల వద్ద మూడో వికెట్, 32 పరుగులకు నాలుగో వికెట్ పోగొట్టుకుంది. ఈ దశలో మిడిల్ ఆర్డర్ కాస్త కుదురుకున్నట్లు కనిపించింది. అయినా వికెట్ల పతనం ఆగలేదు. వెస్లీ మథవెరే 39, మరుమాని 27, రయాన్ బుర్ల్ 26 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో జింబాబ్వే 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మాయాంక్ ప్రిన్స్ తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం 126 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ రూపంలో 23 పరుగుల వద్ద తొలి ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ 1 పరుగు చేసి అవుటయ్యారు. కానీ మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం దుమ్మురేపాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ జింబాబ్వే బౌలర్ల భరతం పట్టాడు. ఇదే క్రమంలో 4 ఫోర్లు, 4 సికర్ల సాయంతో 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి అవుటయ్యారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 35 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేసి భారత్ ను గెలిపించారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ కు టీ20 కెప్టెన్ గా ఇదే తొలి విజయం.












Click it and Unblock the Notifications