వైభవ్‌ను ఆపేందుకు ఆఫ్ఘన్ పక్కా ప్లాన్.. కెప్టెన్ జద్రాన్ షాకింగ్ కామెంట్స్!
IND vs AFG: భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ల కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడానికి తమ జట్టు వద్ద ఓ ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంగా చేశారు.
ఐపీఎల్ అనుభవంతో స్కెచ్
ఇటీవల కాలంలో నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీ ఆటతీరును ఆఫ్ఘన్ జట్టు చాలా నిశితంగా పరిశీలిస్తోందని ఇబ్రహీం జద్రాన్ తెలిపారు. "వైభవ్ సూర్యవంశీ ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడు. వైభవ్ బ్యాటింగ్ వీడియోలను మేమందరం చూశాం. ఐపీఎల్‌లో మా జట్టులోని పలువురు బౌలర్లు అతనికి వ్యతిరేకంగా బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. అందువల్ల అతని షాట్ సెలెక్షన్, బలహీనతలపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. స్టేడియంలో మా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడమే ఇప్పుడు మా ప్రాథమిక లక్ష్యం" అని ఆఫ్ఘన్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చారు.

జింబాబ్వే సిరీస్‌తో మెరిసిన యువ కెరటం
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ప్రారంభంలో కొద్దిగా కష్టంగా సాగినప్పటికీ.. ఆ తర్వాత అతను పుంజుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌లకు తుది జట్టులో అవకాశం దక్కనప్పటికీ.. వచ్చిన అవకాశాన్ని వైభవ్ రెండు చేతులా ఉపయోగించుకున్నాడు. ఆ సిరీస్‌లో వరుసగా 50, 20, 81 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'అవార్డును గెలుచుకున్నాడు. ఓపెనర్‌గా అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన తీరు భారత జట్టుకు కొత్త ఊపునిచ్చింది.
ఐపీఎల్ ప్రదర్శన వల్లే..
వైభవ్ సూర్యవంశీ భారత జాతీయ జట్టులోకి రావడానికి ముఖ్యమైన కారణం ఐపీఎల్ 2026 సీజన్లో అతని ఆల్ రౌండ్ ప్రదర్శనే కారణం. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం ఒకే సీజన్లో 776 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో పెద్ద పెద్ద షాట్లు ఆడగలగడం అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. జింబాబ్వేపై విజయం వైభవ్ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరిచింది. అయితే భారత జట్టులో సంజు శాంసన్ వంటి సీనియర్ ఆటగాడు అందుబాటులో ఉండటంతో తొలి టీ20 మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది జట్టు యాజమాన్యం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ గా ఇబ్రహీం జద్రాన్ కొత్త బాధ్యతలు
ఈ సిరీస్ ఇబ్రహీం జద్రాన్‌కు కూడా ప్రత్యేకమైనది. అతను ఇటీవల రషీద్ ఖాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ టీ20ఐ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. కెప్టెన్సీ ఓ పెద్ద బాధ్యత అని జద్రాన్ అంగీకరించాడు, కానీ తాను దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదని తెలిపాడు. ఓ ఆటగాడిగా, కెప్టెన్‌గా తాను ఈ బాధ్యతను ఆస్వాదించడానికి, ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని జద్రాన్ చెప్పాడు. రషీద్‌తో తనకున్న మంచి అవగాహన, సంభాషణ జట్టుకు ప్రయోజనకరంగా ఉన్నాయని కూడా అతను పేర్కొన్నాడు.
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ అనేక విధాలుగా ప్రత్యేకమైనది. ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా భారత్‌తో సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మూడు మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల కోసం భారత జట్టు అతిథి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ను ఉపయోగించుకోవలసి ఉంటుంది.













Click it and Unblock the Notifications
