లూజ్ మోషన్స్ అయ్యాయ్.. అయినా ఆడా
Mohammed Siraj: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గాడినపడింది. ప్లేఆఫ్స్ ముంగిట్లో ఫామ్‌లోకి వచ్చింది. నాకౌట్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లా ఛాంపియన్‌లా ఆడింది ఆర్సీబీ. గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి జట్టును నిర్ణీత 20 ఓవర్లల్లో 147 పరుగులకు కుప్ప కూల్చింది.

అనంతరం ఈ లక్ష్యాన్ని సునామీ వేగంతో ఛేదించింది. 13.4 ఓవర్లల్లోనే 152 పరుగులు చేసింది ఆర్సీబీ. ఈ క్రమంలో ఆరు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్.. చెలరేగి ఆడారు. ప్రత్యేకించి డుప్లెసిస్.. దుమ్ము రేపాడు. 23 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, 10 ఫోర్లతో 64 పరుగులు చేశాడు. 27 బంతుల్లో 42 పరుగులతో అతనికి సహకారాన్ని అందించాడు కోహ్లీ.
వారిద్దరూ అవుట్ అయ్యాక.. వెంటవెంటనే నాలుగు వికెట్లను కోల్పోయింది ఆర్సీబీ. విల్ జాక్స్-1, రజత్ పటిదార్- 2, గ్లెన్ మ్యాక్స్‌వెల్- 4, కామెరాన్ గ్రీన్- 1 పరుగుకే అవుట్ అయ్యారు. వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్- 12 బంతుల్లో 21, స్వప్నిల్ సింగ్- 9 బంతుల్లో 15 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఆర్సీబీకి వరుసగా ఇది మూడో గెలుపు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. 10వ స్థానం నుేంచి ఏడో పొజీషన్‌కు చేరుకుంది. 11 మ్యాచ్‌లల్లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో ఉన్నాయి. ఇంకా మూడు మ్యాచ్‌లు చేతిలో ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ మూడింట్లో నెగ్గితే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలను మెరుగుపర్చుకుంటుందా జట్టు.
గుజరాత్ టైటాన్స్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు సక్సెస్ అయ్యారు. స్వప్నిల్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లందరూ వికెట్లు పడగొట్టారు. విజయ్ కుమార్ వైశాఖ్-2, మహ్మద్ సిరాజ్- 2, యాష్ దయాళ్- 2, కామెరాన్ గ్రీన్-1, కర్ణ్ శర్మ- ఒక వికెట్ల తీసుకున్నారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు మహ్మద్ సిరాజ్. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడాడు. మ్యాచ్‌కు ముందు కడుపునొప్పితో బాధపడ్డానని తెలిపాడు. విరేచనాలు అయ్యాయనీ చెప్పాడు. దీనివల్ల తగినంత ఆహారాన్ని సైతం తీసుకోలేదని పేర్కొన్నాడు. శుక్రవారం రాత్రి నుంచీ ఇబ్బంది పడుతూ వచ్చానని అన్నాడు.
ఒకదశలో విశ్రాంతి తీసుకోవాలని భావించినప్పటికీ- టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక అయినందున దానికి ముందు ప్రిపరేషన్‌గా ఈ మ్యాచ్ సహకరిస్తుందనే కారణంతో ఆడాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. తన పెర్‌ఫార్మెన్స సంతృప్తి ఇచ్చిందని, మరింత బాగా ఆడాలని కోరుకుంటోన్నానని వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications