వైజాగ్ పిచ్ అంటే.. ఊపొస్తుందతనికి: వెనుకా ముందు చూడడు
Ashutosh Sharma: ఐపీఎల్ 2025 సీజన్ 18వ ఎడిషన్‌లో ఎట్టకేలకు ఓ థ్రిల్లర్ చూసే అవకాశం లభించింది తెలుగు నేలపై. ఢిల్లీ కేపిటల్స్‌పై గెలిచి తీరుతుందనుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. మట్టికరిచింది. గెలుపు అంచుల్లో నిలిచిన ఆ జట్టు పరాజయాన్ని చవి చూడాల్సొచ్చింది.. ఒకే ఒక్కడి వల్ల.
ఢిల్లీ బోణీ..
సోమవారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే ఈ స్కోర్‌ను అధిగమించింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 211 పరుగులతో విజయాన్ని అందుకుంది.

అసలు హీరో..
ఢిల్లీ ఇన్నింగ్‌లో అసలు హీరో అశుతోష్ శర్మ. 12.3 ఓవర్లల్లో 113 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి, ఓటమి తప్పదనుకున్న దశలో క్రీజ్‌లోకి దిగిన అశుతోష్ వీరవిహారం చేశాడు. గెలవాలంటే- 45 బంతుల్లో 97 పరుగులు అవసరం. అలాంటి పరిస్థితుల్లో భారీ షాట్లతో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
చివరి ఓవర్లల్లో..
రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు కొట్టాడు. ఆ తరువాతి ఓవర్‌లోనూ అతని దూకుడు కొనసాగింది. అతని ప్రతాపానికి ప్రిన్స్ యాదవ్ బలి అయ్యాడు. ఆ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు రాబట్టడంతో ఈక్వేషన్లు మొత్తం మారిపోయాయి. అంతరం ఆరు బంతులకు ఆరు పరుగులుగా తేలింది.
చివరి ఏడు బంతుల్లో ..
చివరి ఓవర్ తొలి రెండు బంతులను మోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఓవర్ అది. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతిని అశుతోష్ శర్మ సిక్సర్‌గా మలిచాడు. జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. అతను ఎదుర్కొన్న చివరి ఏడు బంతుల్లో 34 పరుగులు వచ్చాయంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 6,4,6,2,6,4,6.. పరుగులు రాబట్టుకున్నాడు.
అచ్చొచ్చిన పిచ్..
నిజానికి- అశుతోష్ శర్మకు బాగా అచ్చొచ్చిన పిచ్.. విశాఖపట్నం. గతంలో ఇదే పిచ్‌పై దుమ్ము లేపాడు. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇదే వైజాగ్ పిచ్‌పై సత్తా చాటాడు. ది బెస్ట్ ఫినిషర్‌గా నిలిచాడు. అదే దూకుడు ఐపీఎల్ 2025లోనూ కొనసాగిస్తోన్నాడు అశుతోష్ శర్మ.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్ తరఫున అయిదు మ్యాచ్‌లు ఆడాడు అశుతోష్. 164 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ టోర్నమెంట్‌లో అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు.. 59 (నాటౌట్). బ్యాటింగ్ యావరేజ్ 82. 167.34 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు.
మంచి బోణీ కొట్టినట్టే..
తాజాగా ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ మంచి బోణీ కొట్టినట్టయింది ఈ మెరుపు ఇన్నింగ్‌తో. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లో 66 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఆ అనుభవం అక్కరకొచ్చింది..
ఈ స్థాయిలో చెలరేగి ఆడటానికి గల కారణాలను వివరించాడు అశుతోష్. విశాఖపట్నం స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో ఆడానని, ఆ అనుభవం ఇప్పుడు అక్కరకొచ్చిందని అన్నాడు. వైజాగ్ పిచ్ ఎలా ఉంటుందనేది తనకు బాగా తెలుసునని, ఇక్కడి స్థితిగతులను సులభంగా అర్థం చేసుకోగలిగానని వ్యాఖ్యానించాడు. ఇక్కడి వికెట్ ఉపయోగపడిందని పేర్కొన్నాడు.
ఎప్పటికప్పుడు ఆటతీరును మార్చుకుంటూ..
దేశీయ క్రికెట్‌లో నేర్చుకున్న అనుభవాలను ఐపీఎల్ సీజన్‌లో వర్తింపజేసుకుంటోన్నానని, తనపై తనకు నమ్మకంగా ఉందని చెప్పాడు. నిజానికి- దూకుడుగా ఆడటం తన స్టైల్ కాదని, జట్టు పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన ఆటతీరును మార్చుకోవడానికి రంజీ మ్యాచ్‌లు ఉపయోగపడ్డాయని, ఆ అనుభవంతోనే చివరి ఓవర్ వరకు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని అన్నాడు.












Click it and Unblock the Notifications