'చేతబడిపై చర్యలు తీసుకోండి': బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు?
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం సీఎస్కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఓ వింత చర్చ మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ విజయం సాధించిన తర్వాత సీఎస్కే ఓటమికి "చేతబడి" కారణమంటూ కొందరు సృష్టించిన ఫేక్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
నిమ్మకాయల మాయాజాలం.. మీమ్స్ వెల్లువ
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓ వింత దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబే క్రీజులో ఉన్న సమయంలో గ్యాలరీలోని ఓ సన్‌రైజర్స్ అభిమాని నిమ్మకాయను చేతిలో పట్టుకుని తిప్పుతూ ఏదో మంత్రాలు చదువుతున్నట్లు కనిపించాడు. సరిగ్గా అదే సమయంలో శివమ్ దూబే ఔటవ్వడం యాదృచ్ఛికంగా జరిగినా.. నెటిజన్లు మాత్రం దీనిని "చేతబడి" అంటూ మీమ్స్‌తో హోరెత్తించారు.

బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు ఫేక్ లెటర్
ఈ మీమ్స్ రచ్చ అలా కొనసాగుతుండగానే.. కొందరు ఆకతాయిలు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఒక ఫేక్ లెటర్ సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ సంతకంతో ఉన్నట్లుగా భ్రమ కలిగించేలా ఆ లెటర్ ఉంది. "సన్‌రైజర్స్ అభిమానులు చేసిన చేతబడి, క్షుద్ర పూజల వల్లే మా ప్లేయర్లు ఫామ్ కోల్పోయి వింతగా ఔట్ అయ్యారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోండి" అని అందులో రాసి ఉంది. అయితే ఈ లెటర్ పూర్తిగా నకిలీదని, ఫోటోషాప్ సాయంతో సృష్టించబడిందని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తేల్చాయి. బీసీసీఐకి కానీ, సీఎస్కే యాజమాన్యం కానీ ఇలాంటి వింత ఫిర్యాదు ఏదీ చేయలేదని స్పష్టమైంది.
SRH Team పైన @BCCI కి complaint చేశారు @ChennaiIPL
— Swaasthi (@swaasthi) April 19, 2026
ఇతను black magic చేశాడు అందుకే అది team పైన ప్రభావం ఎక్కువగా ఉంది అని లేఖ లో తెలిపినారు pic.twitter.com/cw2eFGTQUg
గతంలో బెంగళూరు స్టేడియం డీజేపీ ఫిర్యాదు
ఈ ఫేక్ లెటర్ ఇంతలా వైరల్ కావడానికి మరో కారణం ఉంది. ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్థానిక డీజే సీఎస్కే ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించాలని సీఎస్కే అధికారికంగా బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన నిజం కావడంతో ఈ చేతబడి ఫిర్యాదు కూడా నిజమేనని చాలా మంది భ్రమపడ్డారు.
ఐపీఎల్ అంటేనే జోష్.. అందులోనూ హైదరాబాద్-చెన్నై జట్ల మధ్య పోరు అంటే ఆ మజానే వేరు. ఈ క్రమంలో వచ్చే మీమ్స్ సరదాగా ఉన్నంత వరకు పర్వాలేదు కానీ, ఇలా అధికారిక లెటర్లను సృష్టించి తప్పుదోవ పట్టించడం సరికాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటలో గెలుపోటములు ప్రతిభపై ఆధారపడి ఉంటాయే తప్ప, ఇలాంటి నిమ్మకాయల మ్యాజిక్ వల్ల కావని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications