IPL 2026: శ్రేయస్ అయ్యర్ అజేయ శతకం.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా 6 పరాజయాల తర్వాత గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుతం చేసింది. శనివారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ చేతిలో కేకేఆర్ ఓడితే పంజాబ్ కింగ్స్ నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఈ సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయంతో ముగించింది. 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.

శ్రేయస్ అయ్యర్ అజేయ శతకం..
శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104 నాటౌట్) అజేయ శతకంతో 196 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ(2/45) రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్(1/36) ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆయుష్ బదోని(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), అబ్దుల్ సమద్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, శశాంక్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
కొంపముంచిన రిషభ్ పంత్..
196 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మహమ్మద్ షమీ తన వరుస ఓవర్లలో ప్రియాన్ష్ ఆర్య(0), కూపర్ కానల్లీ(18)ని పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ప్రభ్‌సిమ్రాన్ జట్టును ఆదుకున్నారు. అయితే అర్జున్ టెండూల్కర్ వేసిన ఏడో ఓవర్‌లో 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రభ్‌సిమ్రాన్ ఇచ్చిన క్యాచ్‌ను రిషభ్ పంత్ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారేది.












Click it and Unblock the Notifications