Dream 11 : రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిన టైలర్.. పేదరికం నుంచి కోట్లకు అధిపతిగా
అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలోని మారుమూల పల్లెటూరికి చెందిన మహమ్మద్ షాహిద్ జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. దర్జీ పని చేసుకుంటూ జీవనం సాగించే షాహిద్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు! అది కూడా లాటరీనో, జూదమో కాదు, కేవలం డ్రీమ్ 11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో అదృష్టం వరించింది.. ఊహించని ఈ గెలుపుతో షాహిద్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.
డ్రీమ్ 11లో రూ. 3 కోట్లు గెలిచిన షాహిద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఐదవ మ్యాచ్ షాహిద్ జీవితాన్ని మార్చేసింది. దేశంలోని లక్షలాది క్రికెట్ అభిమానుల్లాగే, షాహిద్ కూడా ఈ మ్యాచ్ కోసం డ్రీమ్ 11లో ఒక ఫాంటసీ జట్టును రూపొందించాడు. కానీ, ఆ జట్టు తన జీవితాన్ని ఇలా మలుపు తిప్పుతుందని అతను కలలో కూడా ఊహించలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత, ఫలితాలను చూసుకున్న షాహిద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన జట్టు మొదటి స్థానంలో నిలిచి ఏకంగా రూ. 3 కోట్ల భారీ మొత్తాన్ని గెలుచుకుంది! కళ్ళు చెదిరే ఈ విజయం షాహిద్‌ని కోటీశ్వరుల జాబితాలో చేర్చింది.

పట్టణం విడిచి మాయం అయిన కోటీశ్వరుడు
చిన్నప్పటి నుంచి బట్టలు కుట్టడం నేర్చుకున్న షాహిద్, ఇప్పుడు తన అదృష్టాన్ని స్వయంగా రాసుకున్నాడు. చాత్రా పట్టణంలోని దర్జీ బిఘా ప్రాంతంలో ఒక చిన్న టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో అభినందనలు తెలిపేందుకు చుట్టుపక్కల వారు అతని ఇంటికి క్యూ కట్టారు. కానీ, షాహిద్ ఇల్లు మాత్రం తాళం వేసి ఉంది! అవును, మీరు విన్నది నిజమే. షాహిద్ తన అదృష్టాన్ని అందుకోవడానికి ముంబైకి వెళ్ళిపోయాడు.
అదృష్టం తలుపుతట్టిన రోజు!
స్థానికులు చెప్పిన దాని ప్రకారం, షాహిద్ చాలా సంవత్సరాలుగా డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అదృష్టం కలిసి వచ్చిన రోజు అతను రాంచీలో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే, తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముంబైకి పయనమయ్యాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, షాహిద్ కుటుంబ సభ్యులు కూడా ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. దీంతో ఈ సంచలన కథకు మరింత మిస్టరీ అలుముకుంది.
షాహిద్ విజయం ఒక్క జట్టుతోనే ఆగలేదు. అతను రూపొందించిన మరో మూడు జట్లు కూడా విజయం సాధించాయి. వాటి ద్వారా అతనికి వరుసగా రూ. 8,500, రూ. 5,000, , రూ. 3,500 లభించాయి. "సారా ఖానమ్" అనే ఐడితో షాహిద్ ఈ పోటీలో పాల్గొన్నాడు. కేవలం రూ. 49 పెట్టుబడితో ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు షాహిద్ తన కొత్త జీవితాన్ని ఎలా గడుపుతాడో చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications