మ్యాచ్‌లు గెలవలేరు కానీ.. ఐసీసీ ట్రోఫీలు దొంగిలిస్తారా?
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ మరోసారి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కనీసం బంగ్లాదేశ్ పర్యటనలోనైనా తన పరువు నిలబెట్టుకుంటుందని ఆశించిన పాక్ అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిపోవడమే కాకుండా సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. ఈ పరాజయం పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచంలో పెద్ద దుమారాన్నే రేపుతోంది.
పాక్ దిగ్గజం ఫైర్
ఈ ఘోర ఓటమిపై పాకిస్థాన్ దిగ్గజం, మాజీ సెలెక్టర్ కమ్రాన్ అక్మల్ తీవ్రంగా స్పందించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీని ఉద్దేశించి అక్మల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. "పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి ఎలా ఉందంటే.. నెదర్లాండ్స్ లాంటి జట్టు కూడా ఇప్పుడు మనతో సిరీస్ ఆడి, మనల్ని ఓడించి టెస్ట్ హోదా పొందాలని ఆశపడుతున్నాయి. మైదానంలో మ్యాచ్‌లు గెలవలేనప్పుడు ఇక ఐసీసీ ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తెచ్చుకుంటారా? " అని కమ్రాన్ అక్మల్ ఎద్దేవా చేశాడు. గతంలో ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్.. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించినప్పుడు ఆయన ఆ ట్రోఫీని తన కార్యాలయానికి తీసుకెళ్లారనే ఆరోపణల నేపథ్యంలో అక్మల్ ఈ దొంగతనం కామెంట్స్ చేశాడు.

మ్యాచ్ సాగిందిలా..
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఓపెనర్ తంజిద్ హసన్(107) అద్భుత సెంచరీతో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలోనే 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తస్కిన్ అహ్మద్(4/49) తన వేగంతో పాక్ టాపార్డర్‌ను దెబ్బతీశాడు. చివరి 2 ఓవర్లలో 28 పరుగులు కావాల్సిన దశలో షాహీన్ అఫ్రిది రెండు సిక్సర్లు బాదాడు. అయితే ఆఖరి ఓవర్లో రిషాద్ హుస్సేన్ బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది స్టంప్ అవుట్ అవ్వడంతో పాక్ 279 పరుగుల వద్ద నిలిచిపోయింది.
జట్టు నిర్మాణం పేరుతో ప్రయోగాలు
ఈ సిరీస్ కోసం పాకిస్థాన్ ఏకంగా ఆరుగురు యువ ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది. అయితే జట్టు పునర్నిర్మాణం పేరుతో చేస్తున్న ఈ ప్రయోగాలు విఫలమవ్వడంపై అభిమానులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ తమ జట్టు ఆటతీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తుండగా.. పాక్ క్రికెట్ వర్గాల్లో మాత్రం ఆందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications