కేరళలో ఫిఫా హాలిడే, బెంగళూరులో తెల్లవారుజాము వరకూ రెస్టారెంట్లు ఓపెన్
మనదేశంలో కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లల్లో ఫుట్‌బాల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణ టోర్నీలంటేనే టీవీలకు అతుక్కుపోతుంటారక్కడ. అలాంటిది.. ఏకంగా ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ అంటే వారి సందడికి హద్దు ఉండదు. ఫిఫా టోర్నమెంట్ ముందు నుంచే ఆయా రాష్ట్రాల్లో కోలాహలం నెలకొంది. మెస్సి, రొనాల్డో, నెయ్ మార్, ఎంబాప్పె వంటి సూపర్ స్టార్ల కటౌట్లు, వాల్ పెయింట్లు విస్తారంగా వెలిశాయి. ఇప్పుడిక ఫైనల్ ఫీవర్ ఆవరించింది.
ఫుట్‌బాల్ లవర్స్ ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. సోమవారం నాడు కేరళ వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. భారత్ లో ఫుట్‌బాల్ ఆటకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది.. కేరళ. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఉత్కంఠభరితంగా సాగే ఫిఫా మ్యాచ్ లను వీక్షిస్తూ వస్తోన్నారు మలయాళీలు. ఇక ఫైనల్ కు వారి సందడి చెప్పనక్కర్లేదు.

ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తోన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, ఉపాధ్యాయులు మరుసటి రోజు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేరళ ప్రభుత్వం విద్యాసంస్థలకు ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలకు దీన్ని వర్తింపజేసింది. కేరళలో క్రికెట్ కు సమానంగా ఫుట్ బాల్ కు ఆదరణ ఉందనేది తెలిసిన విషయమే. తమ అభిమాన ఆటగాళ్ల భారీ కటౌట్లను నదులు, రహదారుల పక్కన ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మరోవైపు కర్ణాటక కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. బెంగళూరులో ఫుట్‌బాల్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడి ప్రైవేట్ సంస్థలు, కళాశాలలు తమ ఉద్యోగులు, విద్యార్థుల సౌలభ్యం కోసం మ్యాచ్‌ల సమయంలో పని గంటలను సైతం మార్చిన సందర్భాలు ఉన్నాయి. పలు ఐటీ కంపెనీలు తమ ఆఫీసుల్లోనే భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి మ్యాచ్ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటివి గతంలో చూశాం. ఇప్పుడు అదే వాతావరణం మళ్లీ తెరమీదికి వచ్చింది.
ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలను బహిరంగ ప్రదేశాల్లో తిలకించడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ప్రకటించింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు తెల్లవారుజామున 3:30 గంటల వరకూ తెరిచే ఉంటాయి. శాంతిభద్రతల పరిరక్షణను పకడ్బందీగా పర్యవేక్షిస్తూనే ఈ వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.
ఈ స్పెషల్ స్క్రీనింగ్ నేపథ్యంలో బెంగళూరు నగర పోలీసులు హోటళ్లు, పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లను నిర్ణీత హోటల్ ప్రాంగణాల లోపల మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. రోడ్లపై వెళ్లే వారికి అంతరాయం కలిగేలా ఎల్‌ఈడీ స్క్రీన్లను అమర్చడం లేదా పెద్ద శబ్దాలతో కూడిన స్పీకర్లను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని వెల్లడించారు.













Click it and Unblock the Notifications