దలైలామాతో కేన్ విలియమ్సన్ అండ్ టీమ్
సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. కొన్ని సంచలన విజయాలు నమోదవుతున్నాయి. చిన్న జట్లనుకున్నవి పంజా విసురుతున్నాయి. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి పెద్ద జట్లు వరుస పరాజయాలతో కుదేలవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు విజృంభిస్తోన్నాయి.
ఈ టోర్నమెంట్‌లో మొన్నటివరకు భారత్, న్యూజిలాండ్ జట్లు జైత్రయాత్రను కొనసాగించాయి. బ్లాక్ క్యాప్స్ జోరుకు టీమిండియా బ్రేకులు వేసింది. ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది రోహిత్ సేన. ఈ విజయంతో భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కివీస్.. రెండో స్థానంలో పడిపోయింది.

ఇక తన తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొనబోతోంది న్యూజిలాండ్. శనివారం ఉదయం 10: 30 గంటలకు ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిస్తే- మళ్టీ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది కివీస్. తన సెమీ ఫైనల్స్ బెర్త్‌ను దాదాపుగా కన్‌ఫర్మ్ చేసుకున్నట్టవుతుందా జట్టుకు.
ఈ మ్యాచ్‌ను ఆడటం కోసం ప్రస్తుతం ధర్మశాలలోనే గడుపుతోంది న్యూజిలాండ్ జట్టు. ఈ ఉదయం బౌద్ధ మత గురువు దలైలామాను కలిసింది. ధర్మశాల శివార్లలోని మెక్‌లాయిడ్ గంజ్‌లో ఉన్న దలైలామా నివాసానికి వెళ్లారు ప్లేయర్లు. ఆయనతో మర్యాదపూరకంగా భేటీ అయ్యారు.
కేప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిఛెల్, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, మిఛెల్ శాంట్నర్.. ఇలా దాదాపు ప్లేయర్లందరూ దలైలామాను కలుసుకున్నారు. ఆయన ఆశీర్వాదాన్ని అందుకున్నారు. ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులు వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications