అవుట్ స్టాండింగ్ మాస్ ఇన్నింగ్: 49 బంతుల్లో టీమిండియా లేడీ బాస్ సెంచరీ
ఆసియా గేమ్స్ మహిళల క్రికెట్ సెమీఫైనల్ లో భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సరికొత్త చరిత్ర లిఖించారు. జపాన్ లోని నగోయాలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆమె ఆడిన తీరు మంత్రముగ్ధులను చేసింది. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడారు. ఆది నుంచే ముప్పుతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు భారీ స్కోర్ ను అందించారు.
ఈ క్రమంలో షఫాలీ వర్మ సెంచరీ బాదారు. 49 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు సాధించారు. ఆమె ఆడిన ఈ సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఏకంగా తొమ్మిది సిక్సర్లు, మూడు ఫోర్లు నమోదయ్యాయి. బౌండరీలు, సిక్సర్లతో రూపంలోనే 66 పరుగులు రాబట్టి బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపెట్టారు. ఆసియా క్రీడల సుదీర్ఘ చరిత్రలోనే సెంచరీ సాధించిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా షఫాలీ వర్మ ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను సైతం సొంతం చేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ ఎంతో పరిణతితో కూడిన బ్యాటింగ్ వ్యూహాన్ని అమలు చేశారు. పక్లా క్రికెటింగ్ షాట్లను ఆడాడరు. ఇన్నింగ్స్ ప్రారంభంలో పిచ్ స్వభావాన్ని అంచనా వేస్తూ ఆచితూచి ఆడారు. క్రీజ్ లో కుదురుకున్న తర్వాత బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఆమె బ్యాట్ నుంచి వచ్చిన ప్రతి షాట్ ఎంతో పవర్‌పుల్‌గా కనిపించింది. తన ఇన్నింగ్ లో తొమ్మిది సిక్సర్లు నమోదు కావడమే దీనికి నిదర్శనం.
మహిళల క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నాకౌట్ మ్యాచ్‌లలో ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించడం ఎవరికైనా పెద్ద సవాలే. షఫాలీ వర్మ మాత్రం ఇలాంటి ఒత్తిడిని తన విజయాని ఇంధనంగా మార్చుకున్నారు. ఇటువంటి కీలక మ్యాచ్‌లలో జట్టును ముందుండి నడిపించడంలో ఆమె విజయవంతం అయ్యారు. షఫాలీ వర్మకు భారత జట్టు తరఫున ఆడే డిసైడర్ మ్యాచ్‌లు, నాకౌట్ రౌండ్లలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది.
ఒత్తిడి ఎక్కువగా ఉండే సమయాల్లో బ్యాట్ నుంచి మరింత వేగంగా పరుగులు జాలువారడం ఆమెకు ఉన్న ప్రత్యేకత. అంతర్జాతీయ టోర్నమెంట్ల ఫైనల్స్, సెమీఫైనల్స్ లేదా క్వార్టర్ ఫైనల్స్ ఏదైనా సరే, షఫాలీ క్రీజులో నిలిస్తే చాలు పరుగుల వరద పారాల్సిందే. గత అయిదు నాకౌట్ మ్యాచ్‌లలో ఆమె నమోదు చేసిన అద్భుతమైన స్కోర్ల వివరాలు పరిశీలిస్తే ఆమె నిలకడైన ఫామ్ ఏంటో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ కప్ ఫైనల్- 87, ఆసియా కప్ సెమీఫైనల్- 64, ఆసియా కప్ ఫైనల్- 68, ఆసియా గేమ్స్ క్వార్టర్ ఫైనల్- 40 (నాటౌట్), ఆసియా గేమ్స్ సెమీఫైనల్- 100 (నాటౌట్).. షఫాలి వర్మ సత్తా ఏంటో చాటుతున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ లో పసిడి కోసం కూడా ఆమె ఇదే విధమైన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తారనే అంచనాలు ఉన్నాయి.













Click it and Unblock the Notifications
