India-Pakistan: రవూఫ్ బాటలోనే పాక్ మహిళా క్రికెటర్-భారత్ పై ఆరు వేళ్లతో .. !
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ భారీ నష్టాలు చవి చూసింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఓవైపు తాము నష్టపోయామని అంగీకరిస్తూనే మరోవైపు భారత్ విమానాలు కూల్చేశామని చెప్పుకుంది. అయితే ఇది ఎక్కడా నిరూపణ కాలేదు. అయినా భారత్ 6 యుద్ధ విమానాలు నష్టపోయిందని పాక్ దుష్ప్రచారం చేస్తూనే ఉంది. ఇది ఇప్పుడు క్రికెట్ కూ పాకింది. స్వదేశంలో విమర్శలు ఎదురవుతున్నా పాకిస్తాన్ తో ఆసియా కప్ లో భారత్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్లు భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేందుకు ఆపరేషన్ సిందూర్ ను గుర్తుచేస్తూ ఆరు వేళ్లు చూపిస్తున్నారు.
ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా భారత్ ను ఉద్దేశించి ఆరు వేళ్లు చూపిస్తూ, హెలికాఫ్టర్లు కూలినట్లు సంజ్ఞలు చేసిన పాకిస్తాన్ క్రికెటర్ హరీస్ రవూఫ్ వివాదం రేపాడు. దీనిపై భారత్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగానే.. ఇప్పుడు పాకిస్తాన్ మహిళా క్రికెటర్ ఒకరు వేరే మ్యాచ్ లో విజయం సాదించిన సందర్భంగా అవే సంజ్ఞలు చేసింది. పాకిస్తాన్ మహిళా టీమ్ బౌలర్ నష్రా సుంధూ దక్షిణాఫ్రికాతో లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ముగిశాక ఇలా ఆరువేళ్లను చూపించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్లు తీసిన నష్రా సుంధూ.. పాకిస్తాన్ తరఫున వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సాధించింది. ఈ సందర్భంగా అవార్డు కూడా అందుకున్న సుంధూ.. ఆ తర్వాత రవూఫ్ తరహాలోనే ఆరు వేళ్లూ చూపిస్తూ భారత్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య మరో చిచ్చుకు కారణమవుతోంది. నష్రా తీరుపై భారత అభిమానులు మండిపడుతున్నారు.

మరోవైపు ఇప్పటికే ఆసియాకప్ లో భారత్ తో రెండు మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ రెండింటిలోనూ ఓటమి పాలైంది. అయినా ఫైనల్ కు చేరే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. దీంతో కనీసం ఈ ఫైనల్ మ్యాచ్ లో అయినా ఆడకుండా తప్పుకోవాలని, అనవసరంగా అవమానాల పాలవ్వద్దంటూ అభిమానులు టీమిండియా క్రికెటర్లను వేడుకుంటున్నారు. అయితే బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించడం లేదు.












Click it and Unblock the Notifications