T20 World Cup 2026: పాక్ ఆటగాళ్లకు పీసీబీ భారీ జరిమానా!
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు ఘోర ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. వరుసగా నాలుగో ఐసీసీ టోర్నీలోనూ సెమీఫైనల్ చేరడంలో విఫలమైనందుకు, చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయినందుకు గాను ఆటగాళ్లందరికీ భారీ జరిమానా విధించింది.
ఒక్కొక్కరికి రూ.50 లక్షల జరిమానా
ప్రపంచ కప్ ఆడిన పాకిస్థాన్ జట్టులోని ప్రతి ఆటగాడిపై 50 లక్షల పాకిస్థాన్ రూపాయల (సుమారు 16 లక్షల భారతీయ రూపాయలు) జరిమానా విధించాలని పీసీబీ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్ల జీతాల నుంచి లేదా మ్యాచ్ ఫీజుల నుంచి నేరుగా వసూలు చేయనున్నట్లు సమాచారం. దేశం తరఫున ఆడుతూ వరుసగా విఫలమవుతున్నందుకు ఆటగాళ్లకు ఆర్థికంగా నష్టం కలిగిస్తేనే బుద్ధి వస్తుందని బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్ చేతిలో ఓటమి.. నఖ్వీ అసహనం
ఈ కీలక టోర్నీకి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఎన్నో డ్రామాలు చేశారు. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని.. హైబ్రిడ్ మోడల్ ఒప్పుకోమని పెద్ద ఎత్తున హడావుడి చేశారు. తీరా మ్యాచ్ జరిగినప్పుడు టీమిండియా చేతిలో పాక్ 61 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి పాకిస్థాన్‌లో నఖ్వీని, పాక్ జట్టును నవ్వుల పాలు చేసింది. ఆ అవమానాన్ని భరించలేకనే, ఆటగాళ్లపై పీసీబీ ఇంతటి కఠిన చర్యలు తీసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రపంచకప్‌లో పాక్ ప్రదర్శన ఇలా..
శ్రీలంకలో జరిగిన ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. నెదర్లాండ్స్, అమెరికాపై అతికష్టమ్మీద గెలిచిన పాక్.. భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సూపర్-8లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. శ్రీలంకపై గెలిచినప్పటికీ.. పేలవమైన నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది.
ఆటగాళ్లలో కలవరం
అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు తగ్గినప్పుడు విమర్శలు రావడం సహజం, కానీ ఇలా నేరుగా జరిమానాలు విధించడం పాక్ క్రికెట్‌లో కలకలం రేపుతోంది. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందా లేక రాబోయే టోర్నీల్లో వారిని మెరుగుపరుస్తుందా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications