అసాంతం అద్భుతం.. టీమిండియాపై మోడీ ప్రశంసలు, ప్రముఖులు ఇలా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ను టీమిండియా కైవసం చేసుకోవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. 12 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ సాధించడంతో పటాసులు కాలుస్తూ,స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.
'అసాధారణ మ్యాచ్.. అపూర్వ విజయం' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ టీమిండియాను ప్రశంసించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. టోర్నమెంట్ అసాంతం అద్భుతంగా ఆడారంటూ భారత ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తారు. టీమిండియా ఆటగాళ్లందరికీ ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.

ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. టీమిండియాకు శుభాకాంక్ష్లలు' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
స్మాషింగ్ విక్టరీ.. భారత జట్టులోని ప్రతి ఒక్కరూ కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ గెలవడం ఆనందంగా ఉందన్నారు. అద్భుత ఆటతీరుతో మన జట్టు మరోసారి సత్తా చాటిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు, 'వన్ టీమ్.. వన్ డ్రీమ్.. వన్ ఎమోషన్' అని పేర్కొంటూ బీసీసీఐ మ్యాచ్ ఫొటోలను షేర్ చేసింది.
కాగా, న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ 74 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2013లో ఇంగ్లాండ్ ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.












Click it and Unblock the Notifications