ఎంతైనా ప్రీతి జింతా గ్రేటబ్బా
Preity Zinta: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ దూసుకెళ్తోంది. తిరుగులేని విజయాలను అందుకుంది. 11 సంవత్సరాల తరువాత అంటే 2014లో తొలిసారిగా ప్లేఆఫ్స్ చేరిందా జట్టు. లీగ్స్ దశలో ఇప్పటివరకు 12 మ్యాచ్ లను ఆడిన పంజాబ్ కింగ్స్.. ఓడింది మూడింట్లో మాత్రమే. ఎనిమిది మ్యాచ్ లల్లో ఘన విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్ రద్దయింది.
నేడు తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది. ఢిల్లీ కేపిటల్స్ ను ఢీ కొట్టబోతోంది. జైపూర్ లో ఈ సాయంత్రం 7:30 గంటలకు జరుగనుందీ మ్యాచ్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న పీబీకేఎస్.. టాప్ పొజీషన్ పై కన్నేసింది. ఢిల్లీ కేపిటల్స్ పై గెలిస్తే అగ్రస్థానానికి చేరుకుంటుంది.

ఈ పరిణామాల మధ్య పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ ప్రీతి జింతా తన దాతృత్వం చాటుకున్నారు. ఆర్మీ విమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA)కు భారీ విరాళాన్ని ప్రకటించారు. దీని విలువ 1.10 కోట్ల రూపాయలు. పంజాబ్ కింగ్స్ సామాజిక బాధ్యత కింద ఈ విరాళాన్ని ప్రకటించారు.
పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గల ఉగ్రవాద సంస్థలపై దేశ త్రివిధ దళాలు సాగించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఆర్మీ మహిళ సంక్షేమ సంఘానికి ఈ మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పంజాబ్ కింగ్స్ తెలిపింది.
ఈ విరాళం మొత్తం- అమర వీరుల కుటుంబాలను సంక్షేమానికి, ఆర్థికంగా ఆదుకోవడానికి వినియోగించాల్సి ఉంటుందని, వీర మరణం పొందిన జవాన్ల పిల్లల చదువుల కోసం ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ప్రీతి జింతా వెల్లడించారు. దేశ ప్రజల కోసం జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదని, వారి కుటుంబాలను ఆదుకోవడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు.
ఈ మధ్యాహ్నం జైపూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రీతి జింతా. ఆర్మీ సౌత్ వెస్ట్ కమాండర్, రీజినల్ ప్రెసిడెంట్ సప్త శక్తి, ఆర్మీ విమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, సైనికులు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో ప్రీతి జింతా మాట్లాడారు.
సైనికులు చేసిన త్యాగాలను లెక్కగట్టలేమని, వారి కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. సాయుధ దళాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. తమ కోసం ఎంతో చేస్తోన్న సాయుధ బలగాలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.












Click it and Unblock the Notifications