రెచ్చిపోయిన రచిన్- సెంచరీ: పట్టు కోల్పోయిన రోహిత్: భారీ ఆధిక్యత
IND vs NZ: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై భారీ ఆధిక్యతను సాధించింది న్యూజిలాండ్. తొలి ఇన్నింగ్‌లో 299 పరుగుల ఆధిక్యతతో ఆడుతోంది. ఇంకా మూడు వికెట్లు చేతిలో మిగిలే ఉండటం వల్ల ఈ ఆధిక్యత మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్‌లో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు దెబ్బకొట్టారు. మూడో రోజు తొలి గంటలో వెంటవెంటనే మరో నాలుగు వికెట్లను పడగొట్టారు. ఊపిరి ఆడనివ్వని విధంగా బంతులను సంధించారు. ఈ క్రమంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు కూల్చాడు. మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.

భారత బౌలర్ల ధాటికి డారిల్ మిఛెల్- 18, టామ్ బ్లండెల్- 5, గ్లెన్ ఫిలిప్స్- 14, మాట్ హెన్రీ- 8 వెంటవెంటనే అవుట్ అయ్యారు. జట్టు స్కోరు 193 పరుగుల వద్ద మిఛెల్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. వికెట్లకు కాస్త దూరంగా మహ్మద్ సిరాజ్ సంధించిన డెలివరీని ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యాడు మిఛెల్. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గల్లీ వైపు దూసుకెళ్లిన బంతిని యశస్వి జైస్వాల్ అందుకున్నాడు.
జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో 204 పరుగుల వద్ద టామ్ బ్లండెల్ అవుట అయ్యాడు. అనంతరం రవీంద్ర జడేజా రెచ్చిపోయాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీలను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో 233 పరుగుల వద్ద ఏడు వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్.
ఎంతో సేపు ఆ జట్టు ఇన్నింగ్ ఉండబోదని భావించినప్పటికీ రచిన్ రవీంద్ర ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో చెలరేగుతున్నాడు. సెంచరీ వైపు దూసుకెళ్తోన్నాడు. మరో ఎండ్‌లో టిమ్ సౌథీ అతనికి అండగా నిలిచాడు. ప్రస్తుతం రచిన్ రవీంద్ర 104, టిమ్ సౌథీ 49 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది కివీస్. మొత్తంగా 256 పరుగుల భారీ ఆధిక్యతను సాధించింది.












Click it and Unblock the Notifications