ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్ అయినా ఇంకోటయినా
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య రాయ్‌పూర్‌లో ఈ సాయంత్రం కీలక పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఓటమి తర్వాత ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో ఒత్తిడిలో ఉంది. ప్లేఆఫ్స్ ఉత్కంఠగా మారిన నేపథ్యంలో ఇరు జట్లకు ఈ విజయం తప్పనిసరి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడవ స్థానంలో ఉన్నా గత ఓటమి వారి జోరును తగ్గించింది. ప్లేఆఫ్స్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ విజయం అత్యవసరం.
మరోవైపు ముంబై ఇండియన్స్ డూ ఆర్ డై పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఆడనుంది. నిలకడ లేకపోవడం, ప్రధాన ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడంతో ప్లేఆఫ్స్ ఆశలు సన్నగిల్లాయి. అయినప్పటికీ.. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్ల అవకాశాలను దెబ్బకొట్టగలదు. రాయ్ పూర్ పిచ్ పై పెద్దగా అనుభవం లేదు ఆర్సీబీకి. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఈ వేదికపై పరిస్థితులకు అలవాటు పడి ఉండటం ఈ జట్టుకు సవాలుగా మారింది.

ఫిల్ప్ సాల్ట్ లేకపోవడం పవర్‌ప్లే దూకుడును ప్రభావితం చేసింది ఆర్సీబీకి. జాకబ్ బెథెల్ నిలకడ కోసం ప్రయత్నిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలోనూ బలహీనతలు ఉన్నాయి. జోష్ హేజిల్‌వుడ్ రాణించినా పరుగులు ధారాళంగా ఇస్తోన్నాడు. మరోవంక ముంబై మిడిల్ ఆర్డర్ ఆందోళన కలిగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇంకా స్థిరంగా రాణించలేకపోతున్నారు. కొత్త బంతి బౌలింగ్‌లో దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ ఆరంభ వికెట్లు తీయలేకపోవడం సమస్యే. ఇది బుమ్రాపై ఒత్తిడిని పెంచుతోంది.
పాయింట్ల పట్టికలో కిందికి జారిపోకుండా ఉండాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుండగా, ప్లేఆఫ్స్‌లో నిలబడేందుకు ముంబై పోరాడుతోంది. ఈ మ్యాచ్ ఇరు జట్ల ప్లేఆఫ్స్ ఆశలకు కీలక మలుపు అవుతుంది. ఇది వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముఖాముఖి రికార్డు పరిశీలిస్తే, ఆర్సీబీ- ముంబై మధ్య 35 మ్యాచ్‌లు జరిగాయి. బెంగళూరు 16 విజయాలు సాధించగా, ముంబై 19 మ్యాచ్‌లలో గెలిచింది.
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని అంచనా. వాంఖెడే/చిన్నస్వామి వంటి హై-స్కోరింగ్ గ్రౌండ్ కాదు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ సులభతరమౌతుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ. మంచు కారణంగా బౌలర్‌లకు రెండో ఇన్నింగ్స్‌లో బంతిపై పట్టుదొరకడం కష్టం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11లో జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కేప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రోమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్. ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలామ్ దార్.
ముంబై ఇండియన్స్ తుదిజట్టులో: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా/షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, జస్ ప్రీత్ బుమ్రా, ఏఎం ఘజాన్‌ఫర్. ఇంపాక్ట్ ప్లేయర్: శార్దూల్ ఠాకూర్.












Click it and Unblock the Notifications